
లిఫ్ట్‌లో ఇరుక్కున తల్లి బిడ్డలను కాపాడిన కేపీహెచ్‌బీ పోలీసులు..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లి పరిధిలోని కెపిహెచ్బీ కాలనీలో ఓ తల్లి, చిన్నారి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన ఘటన కలకలం రేపింది. వారి ఆర్తనాదాలు విన్న స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
డయల్-100కు సమాచారం అందిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి, ఇద్దరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.పోలిసుల తెలిపిన వివరాల ప్రకారం, కెపిహెచ్బీ 9వ ఫేజ్‌లో ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ భవనంలోని లిఫ్ట్‌లో ఓ మహిళ తన చిన్నారితో కలిసి ప్రయాణిస్తుంది.
ఇంతలో సాంకేతిక లోపం కారణంగా లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో తల్లి, చిన్నారి కొంతసేపు లిఫ్ట్‌లోనే చిక్కుకుపోయారు. ఆందోళనకు గురైన వారు సహాయం కోసం ప్రయత్నించగా, డయల్-100 ద్వారా పోలీసులకు సమాచారం అందింది.
సమాచారం అందుకున్న కెపిహెచ్బీ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, భవన సిబ్బంది సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు లిఫ్ట్ తలుపులు తెరిపించి, తల్లి, చిన్నారిని ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఇద్దరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
సకాలంలో స్పందించి తమ ప్రాణాలను కాపాడిన పోలీసులకు బాధితులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. లిఫ్ట్‌లలో సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు భయాందోళనకు గురికాకుండా అత్యవసర అలారం లేదా హెల్ప్‌లైన్ ద్వారా సమాచారం ఇవ్వాలని, లిఫ్ట్ తలుపులు బలవంతంగా తెరవడానికి ప్రయత్నించవద్దని పోలీసులు సూచించారు.




