KhammamPoliticalTelangana

భార్యపై భర్త కత్తితో దాడి...

భార్యపై భర్త కత్తితో దాడి...

భార్యపై భర్త కత్తితో దాడి

ఏన్కూరు పోలీస్ స్టేషన్ లో ఘటన.. తీవ్రంగా గాయపడిన మహిళ

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. కేసు నమోదు చేసిన పోలీసులు

CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జూలై 20 2026: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల పరిధిలోని ఎర్రబోడు తండాకు చెందిన భూక్య రాంబాబు, తన భార్య రజినిపై కత్తితో దాడి చేసిన ఘటన సోమవారం తీవ్ర కలకలం రేపింది. కుటుంబ కలహాలు ఈ ఘటనకు దారితీసినట్లు సమాచారం.
స్థానికుల వివరాల ప్రకారం, గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రజిని తన పుట్టింటైన సాతానిగూడెం గ్రామంలో ఉంటోంది. ఇదిలా ఉండగా, గ్రామ సంఘం ద్వారా తీసుకున్న రుణం చెల్లించాలని సంఘ సభ్యులు ఒత్తిడి చేయడంతో రజినిని ఏన్కూరులోని ఎస్‌బీఐ బ్యాంకుకు తీసుకువచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న భర్త రాంబాబు బ్యాంకు వద్దకు వచ్చి రజినితో వాగ్వాదానికి దిగినట్లు తెలిసింది. ఇదే సమయంలో, అంతకుముందు రజిని కుమార్తె తన తల్లిపై ఏన్కూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, విచారణ నిమిత్తం పోలీసులు రజినిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
పోలీస్ స్టేషన్‌కు రజిని వెళ్లడాన్ని గమనించిన రాంబాబు పోలీస్ స్టేషన్ కు చేరుకుని తన వద్ద ఉన్న కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. రజిని ఎడమ భుజం, ఎడమ చేతి మణికట్టు భాగంలో కత్తితో పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. బాధతో ఆమె కేకలు వేయగా, అక్కడున్న పోలీసులు, స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఏన్కూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆమెకు అక్కడ చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.
ఘటనపై ఏన్కూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి గల పూర్తి కారణాలు, కుటుంబ వివాదాలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ ఘటనతో ఏన్కూరు పోలీస్ స్టేషన్ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button