
చెక్కుల పంపిణీ సభలో ఎమ్మెల్యే అసంతృప్తి
గ్రామ శాఖ అధ్యక్షులకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు నిర్వహించవద్దు – ఎమ్మెల్యే రాందాస్ నాయక్
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 04 2026: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని 32 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు, 73 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
అయితే కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో పార్టీ వ్యవహారాలపై ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల స్థాయిలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి గ్రామ శాఖ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు తప్పనిసరిగా సమాచారం అందించాలని సూచించారు. అందరినీ భాగస్వామ్యం చేయకుండా కార్యక్రమాలు నిర్వహించడం సరికాదని అన్నారు.
సమాచారం ఇవ్వలేకపోతే మండలంలో కార్యక్రమం పెట్టొద్దు… నన్ను కూడా పిలవొద్దు అంటూ నిర్వాహకులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి ప్రతి నాయకుడు, కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సీహెచ్ శేషగిరిరావు, ఆర్ఐ శ్రీనివాస్‌రావు, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చిరాం నాయక్, జిల్లా కమిటీ కార్యదర్శి సామేల్, ఏ-బ్లాక్ అధ్యక్షుడు వేముల కృష్ణప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




