
ఐడీ ప్రూఫ్ అడిగినందుకు హోటల్ సిబ్బందిపై దాడి
Web desc : హైదరాబాద్‌లోని భరత్‌నగర్‌లో ఓ హోటల్‌లో సాధారణ చెక్-ఇన్ ప్రక్రియ వివాదానికి దారితీసింది. గుర్తింపు పత్రం (ఐడీ ప్రూఫ్) చూపించాలని కోరిన హోటల్ సిబ్బందిపై నలుగురు వ్యక్తులు కర్రలతో దాడి చేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ దాడిలో హౌస్‌కీపింగ్ విభాగానికి చెందిన ఓ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం, భరత్‌నగర్‌లోని లివింగ్ ట్రీ సూట్స్ హోటల్‌కు అర్ధరాత్రి సమయంలో నలుగురు వ్యక్తులు గది బుక్ చేసుకునేందుకు వచ్చారు.
హోటల్ నిబంధనల ప్రకారం చెక్-ఇన్ సమయంలో ఆధార్ కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాన్ని చూపించాలని సిబ్బంది కోరారు. అయితే, తాము స్థానికులమని, తమను ఎందుకు ఐడీ అడుగుతున్నారని ఆ నలుగురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగినట్లు పోలీసులు తెలిపారు.
కొద్దిసేపటికే ఈ వాగ్వాదం తీవ్రరూపం దాల్చి, వారు కర్రలతో సిబ్బందిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడిలో హౌస్‌కీపింగ్ ఉద్యోగి ఆకాశ్ తలకు తీవ్ర గాయమై అధిక రక్తస్రావం జరిగింది. అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనతో హోటల్‌లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
బాధితుడి ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు గుర్తుతెలియని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హోటల్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల గుర్తింపు, అరెస్టు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.




