
ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
Web desc : కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో శనివారం పెను ప్రమాదం తప్పింది. గొల్లపల్లి ప్రాంతానికి చేరుకున్న సమయంలో బస్సు డ్రైవర్ చక్రపాణికి అకస్మాత్తుగా అస్వస్థత, ఫిట్స్ వచ్చినట్లు సమాచారం.
ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి, నడుస్తున్న బస్సును రోడ్డు పక్కన సురక్షితంగా నిలిపివేశారు. అనంతరం బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ వెంటనే కిందికి దించి వారి ప్రాణాలను కాపాడారు. బస్సు ఆగిన తర్వాత డ్రైవర్ కొంతసేపు రోడ్డుపైనే సేదతీరగా, స్థానికులు వెంటనే స్పందించి సహాయం అందించారు.
అనంతరం ఆయనను ఎల్లారెడ్డిపేటలోని అశ్విని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ చక్రపాణి చూపిన సమయస్ఫూర్తి, బాధ్యతాయుత వైఖరిపై స్థానికులు, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన అప్రమత్తత వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని పలువురు అభిప్రాయపడ్డారు.




