
ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే బహిరంగ లేఖ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో సంగారెడ్డి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.ముఖ్యమంత్రి పర్యటనను కేవలం రాజకీయ ప్రచారానికి పరిమితం చేయకుండా జిల్లా అభివృద్ధికి ఉపయోగపడేలా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుగా అమలు చేసి, ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంగారెడ్డికి నిధులు మంజూరు చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు కనిపించడం లేదని విమర్శించారు.సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలోని పందొమ్మిది మండలాల మూడు వందల తొంభై ఏడు గ్రామాలకు సాగునీరు అందించే సంగమేశ్వర-బసవేశ్వర ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టులకు తక్షణమే నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రధానంగా డిమాండ్ చేశారు.
దాదాపు మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులు పూర్తయితే మెతుకుసీమ రైతులకు శాశ్వత భరోసా లభిస్తుందన్నారు.ప్రస్తుతం వర్షాధారంగా వ్యవసాయం చేస్తున్న రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని, ఈ ప్రాజెక్టులు పూర్తయితే వేలాది మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. వర్షాలు సకాలంలో పడకపోయినా సాగునీటి భరోసాతో రైతులు సమయానికి వ్యవసాయ పనులు చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో మంజూరైన పలు అభివృద్ధి పనులు నేటికీ పెండింగ్‌లో ఉన్నాయని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సంగారెడ్డి, సదాశివపేట కూరగాయలు మరియు మాంసం మార్కెట్ యార్డులకు వరుసగా తొమ్మిది కోట్ల ముప్పై ఒక్క లక్షలు, ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు, ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద సంగారెడ్డికి ఇరవై కోట్లు, సదాశివపేటకు ఎనిమిది కోట్లు, అదనంగా ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై మూడు లక్షలు, పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధుల కింద సంగారెడ్డికి నలభై ఐదు కోట్ల రూపాయల నిధులను తిరిగి మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని కోరారు.
ఆత్మకూర్ నుంచి సింగూర్ వరకు రహదారి టెండర్ అయినా పనులు ప్రారంభం కాలేదని, ప్రధాన జిల్లా రహదారుల పనులకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇస్నాపూర్ నుంచి సంగారెడ్డి వరకు పదిహేను కిలోమీటర్ల మేర మెట్రో రైలు సేవలను పొడిగించాలని కూడా డిమాండ్ చేశారు. రోజూ వేలాది మంది రాష్ట్ర రాజధానికి రాకపోకలు సాగిస్తున్నందున మెరుగైన ప్రజా రవాణా సౌకర్యం అవసరమని తెలిపారు.
అదేవిధంగా విద్య, పర్యాటకం, మైనార్టీ సంక్షేమ రంగాలపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. సంగారెడ్డి, సదాశివపేటలో నిర్మాణాలు పూర్తైన మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలను వెంటనే ప్రారంభించాలని, చిన్న హజ్ భవనం కోసం ఇప్పటికే వెచ్చించిన రెండు కోట్ల రూపాయలతో పాటు అదనంగా మరో రెండు కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ నివాస పాఠశాల సముదాయాన్ని సంగారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని కోరారు. సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువును జలవిహార్ తరహాలో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మార్చాలని, నియోజకవర్గంలోని ఆలయాల వద్ద కళ్యాణ మండపాలు, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.




