KhammamPoliticalTelangana

నీటి వనరులపై కలెక్టర్‌ ఆరా

నీటి వనరులపై కలెక్టర్‌ ఆరా

నీటి వనరులపై కలెక్టర్‌ ఆరా

నీటి వృథాకు చెక్‌.. తాగునీటికి ప్రాధాన్యం

సాగర్ కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను పరిశీలించిన కలెక్టర్ దివాకర్

52వ రెగ్యులేటర్‌, సిరిపురం మేజర్‌ కాలువ, జన్నారం నిమ్మవాగు పరిశీలన

సీతారామ కాలువ ద్వారా వస్తున్న గోదావరి జలాలపై అధికారులతో సమీక్ష

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్‌ నరసింహ ఆగస్టు 21 2026: ఏన్కూర్ మండల పరిధిలోని సీతారామ కాలువ ద్వారా సాగర్ కాలువలోకి చేరుతున్న గోదావరి జలాల పరిస్థితిని జిల్లా కలెక్టర్‌ దివాకర్‌ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 52వ రెగ్యులేటర్‌, సిరిపురం మేజర్‌ కాలువ ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్‌ నీటి ప్రవాహాన్ని స్వయంగా పరిశీలించి, ప్రస్తుతం కాలువలోకి వస్తున్న నీటి పరిమాణం, లభ్యత, ప్రవాహ పరిస్థితులపై నీటిపారుదల శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సీతారామ కాలువ ద్వారా సాగర్ కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను సాగు, తాగునీటి అవసరాలకు సమర్థవంతంగా వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అందుబాటులో ఉన్న నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరాలకు అనుగుణంగా నీటి వినియోగాన్ని పర్యవేక్షించాలని సూచించారు.
కాలువల్లో నీటి ప్రవాహం కొనసాగుతున్న సమయంలో రెగ్యులేటర్లు, కాలువల వద్ద సిబ్బందిని అప్రమత్తంగా ఉంచాలని, ఎక్కడైనా నీటి వృథా, లీకేజీలు లేదా ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడితే వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. నీటి లభ్యతను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఆయకట్టు ప్రాంతాలకు అవసరమైన మేరకు నీటిని అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
జన్నారం నిమ్మవాగు పరిశీలన
అనంతరం జన్నారం వద్ద ఉన్న నిమ్మవాగును పరిశీలించారు. నిమ్మవాగులోని నీటి ప్రవాహం, అందుబాటులో ఉన్న నీటి నిల్వలు, ఆయకట్టు ప్రాంతాలకు నీటి సరఫరా తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. రానున్న రోజుల్లో నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని సూచించారు.
ప్రస్తుతం గోదావరి జలాలు సాగర్ కాలువలోకి చేరుతున్న నేపథ్యంలో నీటి వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా తాగునీటి అవసరాలకు ఇబ్బందులు తలెత్తకుండా నీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, తాగునీటికి అవసరమైన ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వినియోగిస్తూ నీటి వృథాను అరికట్టేందుకు సహకరించాలని కోరారు.
కాలువలు, రెగ్యులేటర్లు, వాగుల వద్ద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. నీటి పరిస్థితిపై నిరంతరం నివేదికలు తీసుకుంటూ, అవసరాన్ని బట్టి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖ సీఈ వాసంతి, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈ బాబురావు, డీఈఈలు ఆనంద్‌, కిషోర్‌, ఏఈఈలు, ఇతర నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button