
సామాజిక మాధ్యమాలపై బాలికలు అప్రమత్తంగా ఉండాలి
చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి: భరోసా ఎస్సై షాహినా
సీకే న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 22 2026 వైరా న్యూస్: బాలికలు సామాజిక మాధ్యమాల ప్రభావానికి లోనుకాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని భరోసా ఎస్సై షాహినా సూచించారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించే సమయంలో వ్యక్తిగత భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
వైరా రోడ్డులోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యాసౌధ క్యాంపస్లో యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సేవా సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై షాహినా మాట్లాడుతూ.. తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ఫొటోలు, ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామా, పాస్వర్డ్లు వంటి వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు ఇవ్వకూడదని సూచించారు.
సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా వేధింపులకు గురిచేసినా, బెదిరించినా, అనుచిత సందేశాలు పంపినా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు విషయం తెలియజేయాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు, సైబర్ మోసాలకు సంబంధించి 1930కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు. తప్పు చేసిన వ్యక్తిపై ఫిర్యాదు చేయడం బలహీనత కాదని, సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడమే నిజమైన ధైర్యమని బాలికలకు సూచించారు.
ఆరోగ్యంపై అవగాహన అవసరం
డాక్టర్ అమీనా మాట్లాడుతూ.. కిశోర దశలో శరీరంలో, మనసులో అనేక మార్పులు చోటుచేసుకోవడం సహజమన్నారు. వాటిపై అపోహలు, భయాలు, సిగ్గు లేకుండా సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఏదైనా ఆరోగ్య సమస్య ఎదురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా వైద్య సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు.
నెలసరి సమయంలో వ్యక్తిగత పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, శుభ్రమైన శానిటరీ ప్యాడ్లు లేదా ఇతర పరిశుభ్రమైన ఉత్పత్తులను వినియోగించాలని సూచించారు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా పౌష్టికాహారం తీసుకోవాలని చెప్పారు. బాలికలు అడిగిన ఆరోగ్య సంబంధిత సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్పీవీ టీకా కీలకమని, అర్హత ఉన్న బాలికలు వైద్యుల సూచన మేరకు టీకా తీసుకోవాలని సూచించారు.
మానసిక ధైర్యం అవసరం
డాక్టర్ సోహెల్ మాట్లాడుతూ.. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని అన్నారు. జీవితంలో ఎదురయ్యే అపజయాలు, సమస్యలు, నిరాశలను చూసి కుంగిపోకుండా సానుకూల ఆలోచనతో ముందుకు సాగాలని సూచించారు. సమస్యలను ఒంటరిగా ఎదుర్కొనే ప్రయత్నం చేయకుండా అవసరమైన సమయంలో కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, నిపుణుల సహాయం తీసుకోవాలని తెలిపారు. మానసిక సహాయం కోసం 14416కు ఫోన్ చేయవచ్చని చెప్పారు.
బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అవగాహన
ఎయిడ్ సేవా సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే. శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాల్య వివాహాల వల్ల బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు. బాల్య వివాహాలకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు, శిక్షలు, జరిమానాలపై విద్యార్థులకు వివరించారు. బాల్య వివాహాలను పూర్తిగా నిర్మూలించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని, 2030 నాటికి బాల్య వివాహ రహిత భారతదేశం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే 1098కు సమాచారం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కే. శ్రీనివాస్, ఎస్సై షాహినా, డాక్టర్ అమీనా, డాక్టర్ సోహెల్, డాక్టర్ అరుణ, భరోసా సెంటర్ ప్రతినిధులు రాజకుమారి, సంధ్య, భాస్కర్, కళాశాల ప్రిన్సిపాల్ అనిత తదితరులు పాల్గొన్నారు.




