
ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై మాజీ ఎమ్మెల్యే సండ్ర ఆగ్రహం!
web desc : ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు ఆశించిన స్థాయిలో వైద్య సేవలు అందడం లేదని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆవేదన వ్యక్తం చేశారు. 100 పడకల కొత్త ఆసుపత్రి భవనం అందుబాటులోకి రావడంతో పాటు సుమారు 17 మంది వైద్యులు ఉన్నప్పటికీ.. ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.
కొంతమంది వైద్యులు విధులకు సమయానికి హాజరు కావడం లేదని, మరికొందరు ముందుగానే విధుల నుంచి వెళ్లిపోతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని సండ్ర తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. నిరుపేదలు, సామాన్య ప్రజలే ప్రధానంగా ఆశ్రయించే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితులు ఉండటం సరికాదన్నారు.
ఆసుపత్రిలో మంచినీటి సదుపాయం సక్రమంగా లేకపోవడం, మృతదేహాలకు సకాలంలో పోస్టుమార్టం నిర్వహించకపోవడం వంటి సమస్యలపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయని సండ్ర తెలిపారు. కొన్ని ధ్రువపత్రాల జారీ కోసం డబ్బులు అడుగుతున్నారనే ఆరోపణలపైనా అధికారులు సమగ్రంగా దృష్టి సారించి విచారణ చేపట్టాలని ఆయన కోరారు.
ఇటీవల రేజర్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పాము కాటుకు గురైన అనంతరం సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా, సుమారు రెండున్నర గంటల పాటు యాంటీ స్నేక్ వెనం (యాంటీడోట్) అందలేదనే ఆరోపణలు వచ్చాయని సండ్ర తెలిపారు. పరిస్థితి విషమించడంతో బాధితుడిని ఖమ్మం ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. రోగుల ప్రాణాలకు సంబంధించిన విషయంలో రాజకీయాలకు, ఒత్తిళ్లకు తావుండకూడదని సండ్ర స్పష్టం చేశారు. రాజకీయాలు వేరు.. ప్రజల ప్రాణాలు వేరని, ముఖ్యంగా నిరుపేదలు ఆశ్రయించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉందన్నారు.
వైద్య వృత్తిని ప్రజలు ఎంతో పవిత్రంగా భావిస్తారని, వైద్యులను భగవంతుడితో సమానంగా గౌరవిస్తారని సండ్ర గుర్తుచేశారు. వైద్యులు, సిబ్బంది అవసరమైన సమయంలో రోగులకు అందుబాటులో ఉండటంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్యం అందించేలా విధులను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు వచ్చేలా వైద్య సేవలను మెరుగుపరచాలని, ఓపీ విభాగంతో పాటు అన్ని విభాగాల్లోనూ నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సండ్ర కోరారు. వైద్యులు, సిబ్బంది రోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించి, వారి ప్రాణాలను కాపాడటమే ప్రధాన కర్తవ్యంగా భావించాలని సూచించారు.
“ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దు. సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలోని సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి” అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.




