
నిబంధనలు పెట్టింది వారే… ఉల్లంఘిస్తోంది వారే
విదేశీ పర్యటనకు టీచర్ల ఎంపికలో ఇష్టారాజ్యం
పాఠశాల విద్యాశాఖ తీరుపై ఆరోపణలు
నిబంధనలు రూపొందించిన విద్యాశాఖే.. వాటిని ఉల్లంఘిస్తుండటం విమర్శలకు, ఆరోపణలకు దారితీస్తోంది. విదేశాల్లో విద్యావిధానాల పరిశీలన కోసం ఆయా దేశాల్లో పర్యటనకు ఉపాధ్యాయులను ఎంపిక చేసే ప్రక్రియలో ఉల్లంఘనలు, ఫిర్యాదులున్నా.. విద్యాశాఖ పట్టించుకోవట్లేదు.
తొలి విడతగా ఒక్కో దేశానికి 40 మంది (అధికారులతో కలిపి) చొప్పున ఫిన్లాండ్, జపాన్, సింగపూర్, వియత్నాం దేశాలకు 160 మందిని పంపించాలన్నది లక్ష్యం కాగా.. ఇప్పటికే ఫిన్లాండ్ పర్యటన పూర్తయింది. తాజాగా జపాన్, సింగపూర్ పర్యటనలకు టీచర్ల జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. కొందరి ఎంపిక విషయంలో నిబంధనలను పాటించలేదంటూ ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఒకవేళ నిబంధనలను సడలిస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తే.. మరికొందరు ఔత్సాహికులు దరఖాస్తు చేసుకునే వీలుంటుందని సూచిస్తున్నాయి.
ఇవీ ప్రధాన నిబంధనలు
1. వయసు 55 సంవత్సరాలలోపు ఉండాలి
2. కనీసం 10 సంవత్సరాల అనుభవం
3. పనిచేస్తున్న పాఠశాలలో విద్యార్థుల సంఖ్య కనీసం 100 ఉండాలి
4. ఎటువంటి ఛార్జిషీట్/ విచారణ/ క్రిమినల్ కేసు/ ఆరోపణలపై విచారణ పెండింగ్ ఉండరాదు.
5. గుండె, కిడ్నీ, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులను ఎంపిక చేయకూడదు.
ఉల్లంఘనలు మచ్చుకు కొన్ని…
సింగపూర్ పర్యటనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలిని ఎంపిక చేశారు. ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 49 మాత్రమే. అధికారులు మాత్రం ఎస్‌జీటీ కేటగిరీలో ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారని, దాంతో వారి పనితీరును పరిశీలించి ఎంపిక చేశామని చెబుతున్నారు. అదే జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ క్యాడర్‌లో మరో టీచర్‌ను జపాన్ పర్యటనకు ఎంపిక చేయగా.. ఆ పాఠశాలలో విద్యార్థులు 100 లోపే ఉన్నారు. కనీసం 100 మంది విద్యార్థులుండాలన్న నిబంధనతో అనేక మంది దరఖాస్తు చేసుకోలేదు.
అదే ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక స్కూల్ అసిస్టెంట్‌ను సింగపూర్ పర్యటనకు ఎంపిక చేశారు. ఆయన గతంలో బోగస్ మెడికల్ బిల్లులు సమర్పించారని విద్యాశాఖ విచారణలో తేలడంతో మూడు ఇంక్రిమెంట్లు కోత పెట్టి సస్పెండ్ చేశారు. ఆ కేసును న్యాయస్థానంలో కొట్టివేశారని అధికారులు చెబుతుండగా.. నైతికపరంగా ఆ టీచర్ ఎంపిక సరికాదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు.
ఖమ్మం జిల్లాకు చెందిన ఒక ఇన్‌ఛార్జి ఎంఈఓను జపాన్ పర్యటనకు ఎంపిక చేశారు. గెజిటెడ్ హెచ్‌ఎం అయిన ఆయనకు ఇక ఏడాది మాత్రమే సర్వీస్ ఉండగా.. 55 సంవత్సరాల వయసు నిబంధనను ఉల్లంఘించి ఎంపిక చేశారు. దీనిపై పాఠశాల సంచాలకుడు నవీన్ నికోలస్ మాట్లాడుతూ.. అధికారుల కేటగిరీలో వయసు నిబంధన లేదన్నారు. ఆయా కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీయే టీచర్లను ఎంపిక చేసిందని తెలిపారు. ఎక్కువ సర్వీస్ ఉన్న వారు ఎంతో మంది ఉన్నా వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.
జపాన్ పర్యటన జాబితాలో విద్యాశాఖ అధికారులు కూడా కొందరున్నారు.. వారిలో ఇద్దరిపై వివిధ ఆరోపణలతో కేసులు విచారణలో ఉన్నాయి. కనీసం వాటిని కూడా పరిశీలించకుండా ఎంపిక చేశారు. జాబితా విడుదల చేసిన తర్వాత ఇప్పుడు వారి స్థానంలో మరో ఇద్దరిని ఎంపిక చేయడం గమనార్హం.




