
ఏన్కూరులో మంత్రి తుమ్మల పర్యటన
పూర్ణకుంభ స్వాగతం.. స్వామివారి దర్శనం
సీకే న్యూస్ ఖమ్మం జిల్లా ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఆగస్టు 26 2026: రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఏన్కూరు మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ముందుగా రేపల్లెవాడ నాచారం శ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ ఆర్. సమత, ఆలయ ఈఓ ఉడతనేని రామారావు, ఆలయ సిబ్బంది ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి మహాశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు, సిబ్బంది పట్టు వస్త్రాలతో మంత్రిని సత్కరించారు. ఆలయ విశిష్టత, సంప్రదాయాల గురించి అధికారులు మంత్రికి వివరించారు.
స్వామివారి దర్శనం అనంతరం మంత్రి ఏన్కూరు మండలంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన శుభకార్యాలకు హాజరయ్యారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొని శుభకార్యాలు నిర్వహిస్తున్న కుటుంబ సభ్యులను అభినందించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.
మంత్రి పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు ఆయనను కలిసి ఆత్మీయంగా పలకరించారు. మండలంలో మంత్రి పర్యటనతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంది. ఈ కార్యక్రమాల్లో ఆలయ సిబ్బంది, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.




