
మానసిక దివ్యాంగురాలిపై లైంగిక దాడి..
web desc : ఇంట్లో ఒంటరిగా ఉన్న మానసిక దివ్యాంగురాలిపై ఓ దుండగుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఓ గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలు (52) తల్లితో కలిసి ఉంటోంది.
70 ఏళ్లకుపైగా వయసున్న ఆ తల్లి వైద్యం నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి వెళ్లింది. దీన్ని గమనించిన ఓ దుండగుడు ఇంట్లోకి చొరబడి సదరు దివ్యాంగురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు వేయకుండా ఇనుప వైర్లను ఆమె మెడ, కాళ్లకు బిగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
కొద్ది సేపటి తర్వాత ఇంటికి వచ్చిన తల్లి, కుమార్తె పరిస్థితిని చూసి కేకలు వేసింది. స్థానికులు వచ్చి బాధితురాలి మెడ, కాళ్లకు బిగించిన ఇనుప వైర్లను తొలగించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సదరు మహిళను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
క్లూస్‌టీం ఆధారాలు సేకరించగా, నిందితుడిగా భావిస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై సీఐ పీఎన్‌డీ ప్రసాద్ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




