
కొలువుల పేరుతో ఎర.. కోట్లలో దందా…
భద్రాచలంలో రూ.10 కోట్ల ఉద్యోగాల కుంభకోణం?
ఎమ్మెల్యే పాత్రపై అనుమానాలు: బీఆర్ఎస్ నేతలు
సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
ఆగస్టు 30,
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అక్రమ వసూళ్లు, పైరవీలకు అడ్డాగా మారిందని, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి సుమారు రూ.10 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని భద్రాచలం నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్ ఆరోపించారు. తెలంగాణ టూరిజం హోటల్ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు మానే రామకృష్ణతో కలిసి ఆయన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. పేద కుటుంబాలకు చెందిన యువతను నమ్మించి వారి భవిష్యత్తుతో చెలగాటమాడారని మండిపడ్డారు.
ఎమ్మెల్యేకు తెలియకుండానే జరిగిందా?
క్యాంపు కార్యాలయంలోనే ఉంటూ ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతుంటే ఎమ్మెల్యేకు తెలియకుండా ఇదంతా జరిగిందా అని రాంప్రసాద్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం వెనుక ఎమ్మెల్యే పాత్రపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.
ఉన్నతస్థాయి విచారణకు డిమాండ్
రూ.10 కోట్లుగా ఆరోపిస్తున్న ఉద్యోగాల వసూళ్ల వ్యవహారంపై ఉన్నతస్థాయి, నిష్పక్షపాత విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. వసూళ్లకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే భావిస్తే, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాంప్రసాద్ సవాల్ చేశారు.
బాధితులకు డబ్బు తిరిగి ఇప్పించే వరకు, నిందితులకు శిక్ష పడే వరకు బీఆర్ఎస్ వారి తరఫున పోరాడుతుందని స్పష్టం చేశారు. ఉద్యోగాల పేరుతో భారీగా డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు భద్రాచలంలో రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. అధికార యంత్రాంగం, ఎమ్మెల్యే ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.




