
ఖమ్మం నగరంలో రెచ్చిపోయిన చైన్ స్నాచర్లు
ఖమ్మం నగరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మమతా రోడ్డులో ఓ మహిళ మెడలో ఉన్న బంగారు చైన్‌ను ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి లాక్కెళ్లారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటుపల్లి విజయలక్ష్మి మమతా రోడ్డు లో వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు ఒకే ద్విచక్ర వాహనంపై ఆమెను వెంబడించారు.
కొంత దూరం వెళ్లిన అనంతరం ఆమెను దాటి ముందుకు వెళ్లిన వారు తిరిగి వెనక్కి వచ్చారు. అనంతరం బైక్‌పై వచ్చిన దుండగులు మహిళ మెడలో ఉన్న బంగారు చైన్‌ను ఒక్కసారిగా లాక్కొని అక్కడి నుంచి వేగంగా పరారైనట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
చైన్ స్నాచింగ్ ఘటనపై బాధితురాలు గుంటుపల్లి విజయలక్ష్మి ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. బైక్‌పై వచ్చిన ముగ్గురు వ్యక్తుల కదలికలు, వారి ఆనవాళ్ల ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.




