
గూడెం గ్రామం లో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం రూ.10 లక్షల ఆస్తి నష్టం
50 వేల నగదు రెండు తులాల బంగారం బుగ్గిపాలు
పొగతో బిచ్చన్నకు తీవ్ర గాయాలు.. వనపర్తి ఆస్పత్రికి తరలింపు
10 లక్షల ఆస్తినష్టం సిలిండర్ పేలకపోవడంతో తప్పిన పెను ముప్పు
సీకే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి
తెల్లవారుజామున అంతా నిద్రలో ఉండగా ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఇల్లు అగ్నికి ఆహుతైంది. ఇంట్లోని సామగ్రి, నగదు, బంగారం, పుస్తకాలు, ధ్రువపత్రాలు అన్నీ కాలి బూడిదయ్యాయి. కుటుంబ సభ్యులు తృటిలో ప్రాణాలతో బయటపడగా.. ఇంటి యజమాని బిచ్చన్న పొగతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటన చిన్నంబావి మండలం గూడెం గ్రామంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో చోటుచేసుకుంది.
క్షణాల్లో వ్యాపించిన మంటలు
గూడెం గ్రామానికి చెందిన రొడ్డ బిచ్చన్న ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ ఇంటిని కమ్ముకోవడంతో కుటుంబ సభ్యులు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. దీంతో పెను ప్రాణనష్టం తప్పింది. కానీ ఇంట్లోని వస్తువులేవీ మిగలలేదు.
నగదు.. బంగారం బుగ్గిపాలు
మంటల్లో ఫ్రిజ్, కూలర్, టీవీ, వాషింగ్ మిషన్, డ్రెస్సింగ్ టేబుల్, బీరువా తదితర వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దుస్తులు, బియ్యం, తినుబండారాలు, పుస్తకాలు, సర్టిఫికెట్లు, కీలక పత్రాలు బూడిదయ్యాయి. బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారం సైతం మంటల్లో కాలిపోయినట్లు బాధితులు తెలిపారు.
పొగతో బిచ్చన్నకు తీవ్ర గాయాలు
మంటల సమయంలో ఇంట్లో ఉన్న బిచ్చన్న దట్టమైన పొగతో తీవ్ర అస్వస్థతకు గురై గాయపడ్డారు. వెంటనే 108 అంబులెన్స్‌లో వీపనగండ్ల ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కట్టుబట్టలతో వీధిన పడ్డ కుటుంబం
ఇల్లు, ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిపోవడంతో కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. కళ్లముందే సర్వస్వం కాలిపోవడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పేలని సిలిండర్.. తప్పిన భారీ ప్రమాదం
ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉండటంతో మంటలు చెలరేగిన సమయంలో గ్రామస్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. సిలిండర్ పేలి ఉంటే పరిస్థితి మరింత విషమించి భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ సిలిండర్ పేలకపోవడంతో పెను ముప్పు తప్పింది.
మంటలపై పోరాడిన గ్రామస్థులు
మంటలు కనిపించగానే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. నీటితో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం కొల్లాపూర్ నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
ఘటనాస్థలంలో ఎస్సై రామన్ గౌడ్ పరిశీలన
సమాచారం అందుకున్న చిన్నంబావి ఎస్సై రామన్‌గౌడ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితులకు సర్పంచ్ పరామర్శ
గూడెం సర్పంచ్ కొత్త వెంకటరెడ్డి వనపర్తి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న బిచ్చన్నను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని గ్రామస్థులు కోరారు.




