
ప్రేమ పెళ్లి చేసుకున్నాడని దళితుడి ఇల్లు కూల్చివేత!
ఎమ్మార్పీఎస్ నాయకుల ఆగ్రహం.. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్
గద్వాల సెప్టెంబర్ :14
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం రేపల్లె గ్రామంలో ప్రేమ వివాహం చేసుకున్నారనే కారణంతో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన చిన్న కృష్ణ కుమారుడి ఇంటిని అమ్మాయి కుటుంబ సభ్యులు జేసీబీతో కూల్చివేశారని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపించారు. గ్రామ సర్పంచ్ రంగస్వామి సహకారంతోనే ఇంటిని కూల్చివేశారని వారు ఆరోపించారు.
ఈ ఘటనపై సోమవారం ఎమ్మార్పీఎస్ నాయకులు గ్రామంలో పర్యటించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దళిత కుటుంబానికి అన్యాయం జరిగినప్పటికీ ఇప్పటివరకు తహసీల్దార్, జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి స్పందించకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకుడు రాజు మాట్లాడుతూ.. యువకుడు, యువతి పరస్పర ఇష్టంతో ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిపారు. వారు గ్రామం నుంచి వెళ్లిపోయిన సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు యువకుడి ఇంటిని కూల్చివేశారని ఆరోపించారు.
గ్రామంలోని ఎస్సీ మాదిగ కుటుంబాలను బెదిరింపులకు గురిచేస్తున్నారని, ఈ ఘటనపై అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూల్చివేసిన స్థలంలో నెల రోజుల్లోగా బాధిత కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు.
లేనిపక్షంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.




