
అంగన్ వాడి కేంద్రాల నుండి రూ.63 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీడీపీఓ
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లి సీడీపీఓ దారోజు పద్మ రూ.63 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. మెట్ పల్లి అర్బన్ మండలంలో 21 అంగన్ వాడీ కేంద్రాలు ఉన్నాయి.
ఒక్కో అంగన్ వాడీ కేంద్రం నుండి నెలకు రూ.1000 చొప్పున మూడు నెలలకు రూ.3000 చొప్పున మొత్తం రూ.63 వేలు లంచం డిమాండ్ చేసింది. అంగన్ వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు రాయకుండా ఉండేందుకు ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఆదిలాబాద్ ఇంచార్జ్ ఏసీబీ ఢీఎస్పీ గొర్రె మధు తెలిపారు.
శుక్రవారం ఫిర్యాదుదారుల నుండి ఆమె కార్యాలయ ఆవరణ వెలుపల రూ.63 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని ఆమె వద్ద నుండి నగదు స్వాధీనం చేసుకుని నిందితురాలిని అరెస్టు చేసి కరీంనగర్ లోని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి…
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగితే ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేయాలని, వాట్సాప్ నంబర్ 9440446106, ఫేస్ బుక్ (Telangana ACB), X (@Telangana ACB) ద్వారా సంప్రదించాలని ఏసీబీ అధికారులు తెలిపారు.




