
కలెక్టర్ ఆదేశాలకూ కదలని అధికారులు
కూలిన ఇల్లు.. పట్టని పేదల గోడు!
దివ్యాంగురాలి గోడు పట్టదా?
L3 నుంచి L1కు మార్చాలని కలెక్టర్‌కు వినతి.. పరిశీలనకు ఎదురుచూపులు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ సెప్టెంబర్ 26 2026: రఘునాథపాలెం మండలం బూడిదంపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుపై అర్హులైన పేదలకు న్యాయం జరగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా దివ్యాంగురాలైన తేజావత్ చంద్రావతి కుటుంబానికి ఇందిరమ్మ ఇంటి విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చంద్రావతి భర్త భాషా (లేటు) కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో జీవిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గతంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహించిన సమయంలో వారి ఇల్లు శిథిలావస్థలో ఉన్నప్పటికీ L3 కేటగిరీలో నమోదు చేశారని, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే L1 కేటగిరీకి అర్హత ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. అనంతరం కురిసిన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా కూలిపోవడంతో ప్రస్తుతం రేకులు వేసుకుని, చుట్టూ టార్పాలిన్ పట్టాలు కట్టుకుని దుర్భర పరిస్థితుల్లో నివసిస్తున్నట్లు తెలిపారు.
ఈ విషయంపై చంద్రావతి కుటుంబ సభ్యులు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ను కలిసి, తమ దరఖాస్తును పరిశీలించి L3 నుంచి L1 కేటగిరీకి మార్చి ఇందిరమ్మ ఇంటి మంజూరుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. దరఖాస్తును పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.
అయితే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటిని పరిశీలించేందుకు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలపై కూడా అధికారులు స్పందించకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇంటి చుట్టూ మురుగునీరు.. పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం?
మరోవైపు చంద్రావతి నివాసం చుట్టూ మురుగునీరు నిలిచిపోవడంతో పారిశుద్ధ్య సమస్య నెలకొన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దోమల వ్యాప్తి నివారణకు డ్రై డే కార్యక్రమాలు నిర్వహించాలని గ్రామ పంచాయతీ కార్యదర్శిని కోరినా సరైన స్పందన లేదని ఆరోపిస్తున్నారు. గ్రామ సమస్యలపై ఫిర్యాదు చేసిన సమయంలో బాధ్యతారహితంగా మాట్లాడినట్లు కూడా కొందరు గ్రామస్తులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత పంచాయతీ కార్యదర్శి వివరణ ఇవ్వాల్సి ఉంది.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
గ్రామంలోని ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు, సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జిల్లా అధికారులు బూడిదంపాడు గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి చంద్రావతి కుటుంబ పరిస్థితిని అంచనా వేయాలని, నిబంధనల ప్రకారం ఆమెకు అర్హత ఉంటే L3 నుంచి L1 కేటగిరీకి మార్చి ఇందిరమ్మ ఇంటి మంజూరుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే పంచాయతీ కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించి, తప్పిదం నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.




