
గడువు ముగిసినా.. ఆగని మట్టి దందా!
26తో అనుమతి ముగింపు.. ఆ తర్వాతా జోరుగా తరలింపు?
పెద్దపోతులపాడు శివారులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు!
అలంపూర్, సెప్టెంబర్ 28:
మండలంలోని పెద్దపోతులపాడు శివారులో మట్టి తవ్వకాలు, తరలింపుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మట్టి తరలింపునకు సంబంధించి ఈనెల 26వ తేదీ వరకు మాత్రమే అనుమతి ఉన్నట్లు తెలుస్తుండగా.. గడువు ముగిసిన తర్వాత కూడా టిప్పర్ల ద్వారా మట్టి తరలింపు కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఆదివారం నుంచి సోమవారం వరకు సైతం యథేచ్ఛగా టిప్పర్ల సాయంతో అక్రమంగా మట్టి తరలిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
అనుమతి గడువు ముగిసినా వాహనాల రాకపోకలు ఆగకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పగలు, రాత్రి తేడా లేకుండా మట్టి తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు,తరలింపులు జరుగుతున్నాయా? అన్నదానిపై అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
అనుమతి గడువు ముగిసిన తర్వాత కూడా మట్టి తరలింపునకు ఎవరి అండదండలు ఉన్నాయన్న చర్చ మండలంలో సాగుతోంది. అయితే ఈ కథంగం మొత్తం స్థానిక ప్రజాప్రతిని కనుసన్నల్లో జరుగుతుందని సంబంధిత చర్చ జరుగుతోంది.అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, అనుమతుల వివరాలను బహిర్గతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.




