
ఖమ్మంలో నేతల పంచాయతీ.. పబ్లిక్ టాయిలెట్‌కు తాళాలు
ఖమ్మం కార్పొరేషన్ : అధికార పార్టీకి చెందిన ఓ ఇద్దరు నేతల మధ్య విభేదాలు ప్రజలకు శాపంగా మారాయి. ఆ నేతలు ఇద్దరు ప్రజలకు ఉపయోగపడే పబ్లిక్ టాయిలెట్ విషయంలో ఘర్షణ పడటంతో సదరు పబ్లిక్ టాయిలెట్ మూతపడింది.
దానికి తాళం వేశారు. ఆ మార్గం గుండా వెళ్లే మహిళలు టాయిలెట్ మూతబడి ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసరంగా కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తే వారి అవస్థలు చెప్పనలవి కాదు. ఇది నగరంలోని 8వ డివిజన్ పరిధిలోని వైయస్సార్ నగర్ కు వెళ్లే మార్గంలోని మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్ పరిస్థితి.
నగరంలోని ఎస్సార్ గార్డెన్ పక్క నుంచి వైఎస్సార్ కాలనీ కి వెళ్లే రహదారి ఉంది. ఈ రహదారి గుండా వాహనం రద్దీ ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రజలు ఈ మార్గం ద్వారానే ఎక్కువగా నడిచి వెళుతుంటారు. ఈ మార్గంలో ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని సుమారు రూ.4లక్షల వ్యయంతో మోడ్రన్ పబ్లిక్ టాయిలెట్‌ను నిర్మించారు. దీంతో పాటుగా పక్కన షట్టర్‌ను ఏర్పాటు చేశారు.
ఈ షట్టర్‌ను అద్దెకు ఇచ్చి వచ్చిన అద్దె డబ్బులతో పబ్లిక్ టాయిలెట్ నిర్వహణ చేయాలని కాంట్రాక్ట్ కుదిరింది. దాంతో అధికార పార్టీకి చెందిన ఒక మాజీ కార్పొరేటర్ సదరు షట్టర్‌లో టెంట్ హౌస్‌ను పెట్టించారు. కాగా సదరు మాజీ కార్పొరేటర్‌తో విభేదాలు ఉన్న అధికార పార్టీకి చెందిన ఒక నేత దానిని మూయించారు. అతడు వేరే వ్యాపారం నిర్వహిద్దామని చూస్తే మాజీ కార్పొరేటర్ అడ్డుపడ్డాడని ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో పబ్లిక్ టాయిలెట్ మూసివేసి తాళం వేశారు. లక్షల రూపాయల ఖర్చుతో ఖమ్మం కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్ అధికార పార్టీ నేతల మధ్య విభేదాలతో మూసివేశారు. ఈ నేపద్యంలో టాయిలెట్ కు సంబంధించిన మోటర్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. పబ్లిక్ టాయిలెట్‌ను మూసి వేయడంతో ఈ రహదారిలో వెళ్లే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వెంటనే పబ్లిక్ టాయిలెట్‌ను తెరవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పబ్లిక్ టాయిలెట్ పర్యవేక్షకుడు , సఫాయి కర్మచారి సుభాష్ వివరణ కోరగా కొందరు విభేదాలతో పబ్లిక్ టాయిలెట్‌ను మూసివేశామన్నారు. తమ నిర్వహణలోకి తీసుకొని పబ్లిక్ టాయిలెట్‌ను తెరుస్తామన్నారు. ఇందుకు సంబంధించిన సిబ్బందిని నియమిస్తామని పేర్కొన్నారు.




