KhammamPoliticalTelangana

ఖమ్మం కార్పొరేషన్‌పై గులాబీ ముట్టడి

ఖమ్మం కార్పొరేషన్‌పై గులాబీ ముట్టడి

ప్రజాధనం దోపిడీ.. కార్పొరేషన్‌పై బీఆర్ఎస్ ఫైర్

అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణకు డిమాండ్

సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 06 2026: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలు, ప్రజా సమస్యలు, పరిపాలనా వైఫల్యాలపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో గురువారం కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. నగరంలోని పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, రోడ్లు, వీధి దీపాలు, పార్కుల నిర్వహణ, అక్రమ నిర్మాణాలు తదితర సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మాజీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, కర్ణాటి కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఖమ్మం కార్పొరేషన్ అవినీతికి కేంద్రంగా మారిందని ఆరోపించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో లంచాలు తీసుకుంటూ పట్టుబడిన అధికారుల ఘటన కార్పొరేషన్‌లో అవినీతి తీవ్రతకు నిదర్శనమని పేర్కొన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
కార్పొరేషన్‌లో డీజిల్ వినియోగంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, వినియోగంలో లేని వాహనాల పేరుతో డీజిల్ తీసుకుని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నిర్వహణను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజా సౌకర్యాలను పక్కనబెట్టి రాజకీయ ప్రయోజనాలకు ప్రజా ఆస్తులను వినియోగిస్తున్నారని ఆరోపించారు.
నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు రోడ్లపైకి వస్తోందని, తాగునీటి సమస్యలు, వీధి దీపాలు వెలగకపోవడం, రోడ్ల దుస్థితి, పార్కుల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఖమ్మం కార్పొరేషన్‌లో జరుగుతున్న అన్ని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే నగర ప్రజలతో కలిసి మరింత ఉధృతంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button