
బిల్లులు చెల్లించడం లేదంటూ డీఈ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో ఆందోళన
Web desc : ఖమ్మం రూరల్: చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, రూ.50 వేలు లంచం ఇస్తేనే బిల్లు చేస్తామని చెప్పినట్లు ఆరోపిస్తూ ఓ గుత్తేదారు నిరసనకు దిగాడు. ఖమ్మం రూరల్ డివిజన్ పరిధిలోని సంబంధిత శాఖ కార్యాలయం ఎదుట బుధవారం రాత్రి పురుగుల మందు డబ్బాతో నిరసన తెలపడం కలకలం రేపింది.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం అర్బన్ మండలం గొల్లపాడుకు చెందిన అవుల మల్లయ్య 2011 నుంచి వివిధ శాఖలకు సంబంధించి నిర్మాణ పనులు చేస్తున్నట్లు తెలిపాడు.
ఇటీవల పలు గ్రామాల్లో విద్యుత్ లైన్లు, స్తంభాలకు సంబంధించిన మరమ్మతు పనులు చేపట్టి పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు. ఈ పనులకు సంబంధించి సుమారు రూ.2.50 లక్షల బిల్లులు రావాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.50 వేలు మాత్రమే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశాడు. మిగిలిన బిల్లుల కోసం పలుమార్లు అధికారులను సంప్రదించినా ఫలితం లేకపోయిందని తెలిపాడు.
అంతేకాకుండా, రూ.50 వేలు లంచం ఇస్తేనే బిల్లు మంజూరు చేస్తామని చెప్పినట్లు ఆరోపించాడు. పది నెలలుగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్నా న్యాయం జరగడం లేదని మనస్తాపానికి గురైన గుత్తేదారు కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపాడు.
విద్యుత్ శాఖ డీఈ నాగేశ్వరావు వివరణ… మల్లయ్య అనే కాంట్రాక్టర్ చిన్న వెంకటగిరి, తాల్లేసతండ వద్ద పనులు చేసిన మాట వాస్తవమే. అతనికి బిల్లులు కూడా చెల్లింపు ఇవ్వాల్సిందే కానీ ఇంకా కొంత పని పెండింగ్ ఉందని పార్ట్ పేమెంటు చెల్లించడానికి జాప్యం జరిగింది. ఒకేసారి చెల్లించాలని ఆలోచనతో జాప్యం జరిగింది. ప్రస్తుతం పార్ట్ పేమెంట్ కూడా చెల్లించేందుకు లైన్ క్లియర్ చేశాం.




