
మార్కెట్లలో అక్రమ దందాలకు ఇక చెక్..
నిబంధనల ఉల్లంఘనపై చర్యలు!
మంత్రి తుమ్మల మార్కెట్లపై ప్రత్యేక దృష్టి..
లైసెన్స్ లేని వ్యాపారులకు నోటీసులు!
ఏడు చెక్‌పోస్టుల పరిధిలో రూ.2,57,712 నమోదు..
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ నవంబర్ 09 2026: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో పారదర్శకత పెంపొందించడంతో పాటు రైతులకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కెటింగ్ శాఖలో సమూల మార్పులకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు ఐఏఎస్ అధికారుల పర్యవేక్షణలో శాఖ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలోని ప్రధాన వ్యవసాయ మార్కెట్లు, చెక్‌పోస్టులు, కోల్డ్ స్టోరేజీలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ విజిలెన్స్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మార్కెట్లలో ఉన్న లోటుపాట్లను గుర్తించి, వాటిని సరిదిద్దడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
ముఖ్యంగా మార్కెట్లలో జరుగుతున్న జీరో దందా, రైతుల పంటలకు తక్కువ ధర చెల్లించడం, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహించడం వంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మార్కెట్ చెక్‌పోస్టుల వద్ద నిబంధనల అమలును పర్యవేక్షిస్తూ అక్రమ రవాణా, లావాదేవీలపై నిఘా పెంచారు. కొనుగోళ్లు, అమ్మకాల్లో పారదర్శకత తీసుకురావడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో మార్కెట్ కమిటీ విజిలెన్స్ బృందాలు ఏడు చెక్‌పోస్టుల పరిధిలో తనిఖీలు నిర్వహించి మొత్తం రూ.2,57,712 నమోదు చేశాయి. చెక్‌పోస్టుల వారీగా నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి.
- అత్కూర్ చెక్‌పోస్టు – రూ.19,000
- వెంకటాపురం చెక్‌పోస్టు – రూ.36,900
- తల్లాడ చెక్‌పోస్టు – రూ.67,335
- ఏన్కూరు చెక్‌పోస్టు – రూ.35,157
- ముత్తగూడెం చెక్‌పోస్టు – రూ.55,000
- ఎర్రుపాలెం చెక్‌పోస్టు – రూ.1,000
- మధిర చెక్‌పోస్టు – రూ.43,320
మరోవైపు, సరైన లైసెన్సులు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిని గుర్తించి, వారికి మార్కెట్ కమిటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. మార్కెట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వ్యాపారాలు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. లైసెన్సులు పొందిన వ్యాపారులే నిబంధనలకు అనుగుణంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించాలని స్పష్టం చేస్తున్నారు.
ఈ తనిఖీలు, పర్యవేక్షణ కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ విజిలెన్స్ బృంద సభ్యులు ఈ. నరేష్ కుమార్, పి. వీరాంజనేయులు, వి. వెంకటేశ్వర్లు, డి. నిర్మల, కె. పృథ్వీ, ఎ. నిర్మల తదితరులు పాల్గొంటున్నారు.
వ్యవసాయ మార్కెట్లలో అక్రమాలకు అడ్డుకట్ట వేయడం, వ్యాపార లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావడం, రైతుల ప్రయోజనాలను కాపాడటం లక్ష్యంగా మార్కెటింగ్ శాఖ చేపడుతున్న ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. తనిఖీలు నిరంతరం కొనసాగిస్తూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే వ్యవసాయ మార్కెటింగ్ వ్యవస్థ మరింత పటిష్టంగా మారే అవకాశం ఉంది.




