
రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన ఎస్సై
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో మరో భారీ అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో చార్జ్‌షీట్ దాఖలు చేయడానికి సంబంధిత వ్యక్తి నుంచి రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని తీసుకుంటుండగా ఎస్ఐ శ్రీనివాస్‌ను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
నాగారంలోని శిల్పానగర్‌లో ఉన్న ఒక అపార్ట్మెంట్లో బాధితుడి నుంచి రూ. 2 లక్షల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేసి ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కీసర పోలీస్ స్టేషన్లో స్వల్ప వ్యవధిలోనే వరుసగా అవినీతి కేసులు నమోదవుతుండటం పోలీస్ శాఖలో కలకలం రేపుతోంది. ఇటీవల ఇదే పోలీస్ స్టేషన్‌కు చెందిన సీఐతో పాటు మరొక ఎస్ఐ కూడా లంచం కేసులో ఏసీబీకి చిక్కారు.
ఆ ఘటన మరవకముందే ఇప్పుడు మరో ఎస్ఐ శ్రీనివాస్ రూ. 2 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిపోవడంతో కీసర పీఎస్ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు ఈ పోలీస్ స్టేషన్, అందులో పనిచేసే పోలీస్ సిబ్బందిపై నిఘా పెంచాలని స్థానికులు భావిస్తున్నారు.




