
రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.!
Web desc : రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారత రైల్వే మంత్రిత్వ శాఖ తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల (RRBs) పరిధిలో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (NTPC – అండర్ గ్రాడ్యుయేట్) విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 1,688 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందుకోసం ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
భర్తీ చేయనున్న పోస్టులు : ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 రకాల క్లరికల్, కమర్షియల్ విభాగపు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ (లెవల్-3) విభాగంలో అత్యధికంగా 700 ఖాళీలు ఉండగా, వీటికి ప్రారంభ వేతనం రూ. 21,700 గా నిర్ణయించారు.
అలాగే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ విభాగంలో 600, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ విభాగంలో 200, ట్రెయిన్స్ క్లర్క్ విభాగంలో 188 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. లెవల్-2 పరిధిలోకి వచ్చే ఈ మూడు రకాల పోస్టులకు ప్రారంభ వేతనం రూ. 19,900 గా ఉంటుంది. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ జోన్ పరిధిలో మొత్తం 72 ఖాళీలు ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు.. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 15, 2026 నుండి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు నవంబర్ 15 వరకు అవకాశం ఉంది. ఒకవేళ దరఖాస్తులో ఏవైనా తప్పులు దొర్లితే నవంబర్ 16 నుండి నవంబర్ 25, 2026 మధ్య రూ. 250 రుసుము చెల్లించి సవరించుకోవచ్చు.
విద్యార్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ (12వ తరగతి / +2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు (PwBD), ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులతో పాటు డిగ్రీ లేదా ఆపై ఉన్నత విద్యార్హతలు కలిగిన వారికి 50 శాతం మార్కుల నిబంధన నుండి మినహాయింపు ఇచ్చారు.
చివరి పరీక్షా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అనర్హులు. ఇక వయోపరిమితి విషయానికి వస్తే.. జనవరి 1, 2027 నాటికి 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ (NCL) అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుండి 15 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
దరఖాస్తు రుసుము… ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. వీరు మొదటి దశ రాత పరీక్ష (CBT-1) కు హాజరైతే బ్యాంక్ ఛార్జీలు మినహాయించుకుని రూ. 400 తిరిగి వారి ఖాతాలో జమ చేస్తారు.
ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, ట్రాన్స్‌జెండర్, మైనారిటీ మరియు ఈబీసీ (EBC) అభ్యర్థులు రూ. 250 చెల్లిస్తే సరిపోతుంది. వీరు మొదటి దశ పరీక్షకు హాజరైతే బ్యాంక్ ఛార్జీలు పోను పూర్తి రూ. 250 రీఫండ్ చేయబడుతుంది.
ఎంపిక విధానం
అభ్యర్థులను మొదటి దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1), రెండవ దశ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-2), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. మొదటి దశ పరీక్షలో 100 ప్రశ్నలకు 100 మార్కులు, రెండవ దశ పరీక్షలో 120 ప్రశ్నలకు 120 మార్కులు ఉంటాయి.
ప్రతి పరీక్ష సమయం 90 నిమిషాలు కాగా, ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. తెలుగు సహా 15 భాషల్లో పరీక్ష రాసే అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్లో క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ (CBTST) ను రద్దు చేయడం అభ్యర్థులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అయితే ఉద్యోగంలో చేరిన తర్వాత టైపింగ్ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.
ఇక అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://rrb.indianrailways.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో అభ్యర్థులు వెబ్‌క్యామ్ లేదా మొబైల్ కెమెరా ద్వారా తమ లైవ్ ఫోటో (Live Photo) ను క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి ఏదైనా ఒక ఆర్ఆర్బీ జోన్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.




