
సెకండ్ ఎడిషన్ సీఎం కప్–2025-26
ఏన్కూరు మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభం
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు జనవరి 30, 2026 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సెకండ్ ఎడిషన్ సీఎం కప్–2025-26 క్రీడా పోటీల్లో భాగంగా ఏన్కూరు మండల స్థాయి క్రీడా పోటీలు ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి.
మండల కేంద్రంలోని గురుకుల బాలుర పాఠశాల & కళాశాల ప్రాంగణంలో ఈ పోటీలు ఈరోజు మరియు రేపు రెండు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ జెండాను ఆవిష్కరించి అధికారికంగా ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులతో పరేడ్ నిర్వహించి క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారు.
ఈ క్రీడా పోటీల ప్రధాన లక్ష్యం గ్రామ, మండల స్థాయిలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసి జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హులైన విజేతలను ఎంపిక చేయడం అని నిర్వాహకులు తెలిపారు. వివిధ వయసు విభాగాల్లో విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొంటూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు.
కబడ్డీ, వాలీబాల్, ఖో-ఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల ద్వారా క్రీడాస్ఫూర్తి పెంపొందడంతో పాటు యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కలుగుతుందని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తాసిల్దార్ సిహెచ్ శేషగిరిరావు, ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ, ఎంఈఓ నాగిరెడ్డి పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు.
అలాగే కన్వీనర్ వాసవి దేవి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చిరాం నాయక్, కళాశాల ప్రిన్సిపాల్ వేము రాజు, గర్ల్స్ హై స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మా నాయక్, హై స్కూల్ పిడి వీరన్న, తూతక్క లింగన్నపేట గ్రామ సర్పంచ్ ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు. అదేవిధంగా పీఈటీలు వి.రమేష్, నరసయ్య, బి.రమేష్, జి.శోభన్, వీర క్రీడా పోటీల నిర్వహణలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
అతిథులు మాట్లాడుతూ సీఎం కప్ పోటీలు గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికి తీసే గొప్ప వేదికగా నిలుస్తున్నాయని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు.
క్రీడా పోటీలతో గురుకుల బాలుర పాఠశాల ప్రాంగణం ఉత్సాహభరిత వాతావరణంతో కళకళలాడుతూ క్రీడా సంబరాలకు నిలయంగా మారింది. మండల స్థాయి నుంచి ఎంపికయ్యే విజేతలు తదుపరి దశలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు.




