
మండలంలో వాటర్ ప్లాంట్లపై అధికారుల ప్రత్యేక దృష్టి
అధిక ధరలకు నీటి విక్రయాలపై ఆరా
ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి : అధికారులు
నీటి నాణ్యతపై ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్న ఆర్డబ్ల్యూఎస్ శాఖ
CK న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మే 27 2026: ఏన్కూరు మండలంలో మినరల్ వాటర్ ప్లాంట్లు అధిక ధరలకు తాగునీటిని విక్రయిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో మండల అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో మండలంలోని వాటర్ ప్లాంట్ యజమానులను ఎంపీడీవో కార్యాలయానికి పిలిపించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ, ఎమ్మార్వో సిహెచ్ శేషగిరిరావు, ఎంపీఓ జి.వి.ఎస్ నారాయణ పాల్గొని ప్లాంట్ యజమానులతో చర్చించారు.
సమావేశంలో ఎంపీడీవో పల్లి భాగ్యశ్రీ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించడం ప్రతి వాటర్ ప్లాంట్ యజమాని బాధ్యత అని తెలిపారు. ప్రస్తుతం మండలంలోని కొన్ని గ్రామాల్లో మినరల్ వాటర్ ధరలు అధికంగా వసూలు చేస్తున్నారనే సమాచారం తమ దృష్టికి వచ్చిందన్నారు. వేసవి కాలం, తాగునీటి అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు విక్రయాలు చేయడం సరికాదని, ప్రజల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సరసమైన ధరలకు నీటిని విక్రయించాలని సూచించారు.
గ్రామ పంచాయతీల నుంచి తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకుని నిబంధనల ప్రకారం వ్యాపారం నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. లైసెన్స్ లేకుండా వాటర్ ప్లాంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలంలోని అన్ని ప్లాంట్లు స్థానిక సంస్థల నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ కొన్ని ప్రాంతాల్లో సెప్టిక్ ట్యాంకుల పక్కనే బోర్లు డ్రిల్ చేసి అదే నీటిని శుద్ధి పేరుతో వినియోగిస్తున్నారనే సమాచారం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇటువంటి చర్యలు ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని తెలిపారు. తాగునీటి విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎమ్మార్వో సిహెచ్ శేషగిరిరావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ వ్యాపారాలు నిర్వహించాలని సూచించారు. ప్రజలకు హానికరంగా మారే విధంగా ఎవరూ వ్యవహరించరాదని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సంబంధిత శాఖల ద్వారా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఎంపీఓ జి.వి.ఎస్ నారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పరిధిలో నిర్వహిస్తున్న వాటర్ ప్లాంట్లు తప్పనిసరిగా స్థానిక సంస్థల అనుమతులు పొందాలని సూచించారు. పరిశుభ్రత, నీటి నిల్వ విధానం, ప్లాంట్ల నిర్వహణ వంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
ఈ విషయమై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి మండలంలోని వాటర్ ప్లాంట్లలో వినియోగిస్తున్న నీటిపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైన చోట ఆకస్మిక తనిఖీలు నిర్వహించి నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపిస్తామని చెప్పారు. నీటి నాణ్యతలో లోపాలు తేలితే సంబంధిత ప్లాంట్లపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన తాగునీరు అందించడం ప్రతి వాటర్ ప్లాంట్ యజమాని బాధ్యత అని అధికారులు మరోసారి స్పష్టం చేశారు. మండలంలో నిబంధనలు పాటించని ప్లాంట్లపై త్వరలోనే ప్రత్యేక తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.




