
తిమ్మారావుపేటలో తాగునీటి లీకేజీ సమస్య
ఎస్సీ కాలనీలో వృథాగా పారుతున్న తాగునీరు
నీటి వృథాపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
సీకే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఫిబ్రవరి 11 2026: మండల పరిధిలోని తిమ్మారావుపేట గ్రామం ఎస్సీ కాలనీలో తాగునీటి పైపులు పాడవడంతో నీళ్లు వృథాగా రోడ్డుపైకి పారుతున్నాయి.
పలుమార్లు సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ సిబ్బంది పట్టించుకోవడం లేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో పైపుల లీకేజీ కారణంగా రోజూ భారీగా నీళ్లు వృథాగా రోడ్డుమీద పారుతుండటంతో రహదారి చెదిరిపోతోంది.

దీంతో వాహనదారులు, కాలనీ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే నిల్వ నీరు ఉండటం వల్ల దోమలు పెరిగే ప్రమాదం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం నీటి వృథా సమస్యతో పాటు పరిసర ప్రాంతాల్లో అస్వచ్ఛత పెరుగుతోందని ప్రజలు చెబుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించేందుకు సంబంధిత పంచాయతీ అధికారులు, నీటి సరఫరా శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తాగునీటి వంటి అమూల్యమైన వనరును ఇలా వృథా కాకుండా అధికారులు త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సమస్యను పరిష్కరించకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేయాలని కాలనీ ప్రజలు హెచ్చరిస్తున్నారు.



