
మంచిర్యాలలో టెన్షన్ టెన్షన్… బాల్క సుమన్‌పై కేసు నమోదు… అరెస్టు?
మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లిలో సుమన్ అరెస్టు చేస్తారనే నేపథ్యంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల విధులకు అటంకం కలింగించారని బిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కేసు నమోదు చేశారు.
బుధవారం సుమన్ ను పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉంది. క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో తమ విధులకు ఆటంకం కల్పించాడని బాల్క సుమన్, బిఆర్ఎస్ శ్రేణులపై దేవాపూర్ ఎస్ హెచ్ఒ గంగారాం పిర్యాదు చేశారు.
బాల్క సుమన్, మూల రాజిరెడ్డి, గుడిసెల రాజా రమేష్, గాజుల చంద్ర కిరణ్, మేడిపల్లి సంపత్, గోగుల రవీందర్ రెడ్డిలపై రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
బుధవారం ఉదయం స్థానిక బిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద భారీగా పోలీసులు మొహరించారు. సుమన్‌ను అరెస్టు చేస్తారన్న సమాచారం నేపథ్యంలో ఆయన నివాసానికి బిఆర్ఎస్ కార్యకర్తలు వందల సంఖ్యలో చేరుకున్నారు.
క్యాతన్‌పల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే.ఇరువర్గాల గొడవతో ప్రత్యేకాధికారి సతీష్ కుమార్ ఎన్నిక వాయిదా వేశారు. కోరం వచ్చినా అధికారులు ఎన్నిక నిర్వహింలేదు.
ఎన్నిక చేపట్టాలని బీఆర్‌ఎస్ (10), సీపీఐ (4) సభ్యుల డిమాండ్ చేశారు. మంత్రి వివేక్, ఎంపి వంశీ పార్టీ అభ్యర్థులతో కలిసి బయటకు వెళ్లారు. ఎన్నికల గదిలో బిఆర్‌ఎస్ సభ్యులు తమపై దురుసుగా ప్రవర్తించారని వివేక్ ఆరోపించారు.
కాంగ్రెస్ సభ్యులు నిబంధనలు ఉల్లంఘించారని బిఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. ప్రమాణ స్వీకారం తర్వాత అధికారులు కావాలని 10 నిమిషాలు విరామం ఇచ్చారని, తమని కిడ్నాప్ చేయాలని కాంగ్రెస్ పథకం వేసిందని ఆరోపించారు.
ఎన్నిక జరిగే సమావేశం మంత్రి వివేక్ ప్రసంగించడానికి అధికారులు అవకాశం ఇచ్చారని, బిఆర్‌ఎస్, సిపిఐ బలాన్ని చూసి వివేక్ జీర్ణించుకోలేక పోయారని విమర్శించారు.
సజావుగా జరపాల్సిన ఎన్నికలను ఉద్దేశ్యపూర్వకంగానే వాయిదా వేశారని అన్నారు. అలాగే నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లోనూ మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. రెండో రోజు కోరం లేకపోవడంతో అధికారులు వాయిదా వేశారు.



