
రఘురామ కృష్ణరాజుకు గాయం, చికిత్స కోసం హైదరాబాద్‌కు!
Web desc : ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలి సభ్యుల మధ్య సాగుతున్న క్రీడా సమరం రసవత్తరంగా మారుతోంది. రాజకీయ క్షేత్రంలో మాటల తూటాలు పేల్చే నేతలు, ఇప్పుడు మైదానంలో ఆటగాళ్లుగా మారి చెమటోడుస్తున్నారు.
అయితే, గెలుపు కోసం వారు చూపుతున్న పట్టుదల, ప్రొఫెషనల్ క్రీడాకారులకు తీసిపోని వేగం కొన్ని ఇబ్బందులకు దారితీశాయి. ఉత్సాహంగా సాగుతున్న ఈ పోటీల్లో అనూహ్యంగా ముగ్గురు ప్రజాప్రతినిధులు గాయపడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు క్రికెట్ మైదానంలో బ్యాట్ పట్టి అలరించారు. అయితే, బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఒక పరుగు తీసే క్రమంలో రనౌట్ కాకుండా ఉండేందుకు ఆయన వేగంగా క్రీజు వైపు డైవ్ చేశారు.
ఈ క్రమంలో అదుపుతప్పి నేలపై పడిపోవడంతో ఆయన ఎడమ భుజానికి బలంగా దెబ్బతగిలింది. కింద పడే సమయంలో మణికట్టును నేలకు ఆనించడంతో చేయి బెణికింది. వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం ఆయనకు ప్రాథమిక చికిత్స అందించింది.
భుజం నొప్పి తగ్గకపోవడంతో పాటు బొటనవేలికి గాయమవ్వడంతో, మరింత మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం ఆయన గురువారం హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. కబడ్డీ మైదానంలో ‘బోన్ ఫ్రాక్చర్’
అంతకుముందు ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో కూడా ఊహించని ప్రమాదాలు జరిగాయి. కూతకు వచ్చిన రైడర్లను అడ్డుకునే క్రమంలో జరిగిన తోపులాటలో మంత్రికి, మరో ఎమ్మెల్సీ గాయాలపాలయ్యారు.
మంత్రి పార్థసారథి ప్రత్యర్థిని పట్టుకునే ప్రయత్నంలో కిందపడగా, ఆయన పాదం భాగంలో గాయమైంది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కబడ్డీ పట్టులో భాగంగా కిందపడిన ఆయనపై ఇతర ఆటగాళ్లు పడటంతో భుజం వద్ద ఉన్న కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది.
కట్టుతోనే మైదానానికి.. క్రీడా స్ఫూర్తి! గాయాలైనా సరే నేతల్లో ఉత్సాహం మాత్రం తగ్గలేదు. భుజానికి ఫ్రాక్చర్ అయ్యి చేతికి కట్టు ఉన్నప్పటికీ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ బుధవారం మైదానానికి విచ్చేశారు.
తన సహచర సభ్యులు ఆడుతుంటే గ్యాలరీలో కూర్చుని వారిని ఉత్సాహపరుస్తూ అసలైన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల మధ్య సాగుతున్న ఈ పోటీలు నేతల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నా, గాయాల బారిన పడటం పట్ల తోటి సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



