
నకిలీ బంగారం దందా బట్టబయలు
రాగిపై బంగారు ముసుగు.. రుణాల పేరిట మోసం
నకిలీ నగలతో బ్యాంకులనే బురిడీ కొట్టించిన ముఠా
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ జూలై 31 2026: నకిలీ బంగారు ఆభరణాలను తయారు చేసి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, గోల్డ్ కొనుగోలు కేంద్రాలను మోసం చేస్తున్న ముఠాను కారేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సింగరేణి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సాగర్ శుక్రవారం వివరాలు వెల్లడించారు.
సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రాగితో ఆభరణాలు తయారు చేసి వాటిపై బంగారు పూత పూసి అసలైన బంగారంలా కనిపించేలా చేసి వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందడంతో పాటు ప్రైవేట్ గోల్డ్ కొనుగోలు సంస్థలను సైతం మోసం చేసినట్లు దర్యాప్తులో తేలింది.
ఈ క్రమంలో రాంచందర్‌కు చెందిన ఏజెంట్ సునీల్ ద్వారా ఇల్లందులోని ఓ ఫైనాన్స్ సంస్థలో 52 గ్రాముల నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.3.90 లక్షల రుణం పొందినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆ ఆభరణాలను విడుదల చేయించేందుకు హైదరాబాద్‌లోని ఓ గోల్డ్ కొనుగోలు సంస్థను సంప్రదించి, వారి ప్రతినిధి ద్వారా రూ.5.80 లక్షలు తీసుకుని మోసం చేసి పరారైనట్లు వెల్లడించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన కారేపల్లి పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
అరెస్టయిన నిందితుల నుంచి నేరం ద్వారా సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన తెలుపు రంగు వేర్నా కారు (TS04BA2616), రూ.15 వేల నగదు, నేరాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అరెస్టయిన వారిలో గుగులోత్ సునీల్ కుమార్ (భాగ్యనగర్, కారేపల్లి), ముందాడా రాంచందర్ (కారేపల్లి) ఉండగా, దారవత్ రాకేష్ (సూర్యతండా, కారేపల్లి) పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కేసులో మరికొందరి ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని సీఐ సాగర్ తెలిపారు.
ఈ కేసును ఛేదించిన దర్యాప్తు అధికారి ఎస్సై గోపి, సహకరించిన ఎస్సై శ్రీకాంత్‌ను సీఐ అభినందించారు.బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టే ముందు లేదా కొనుగోలు చేసే ముందు వాటి స్వచ్ఛతను తప్పనిసరిగా పరీక్షించుకోవాలని, అనుమానాస్పద లావాదేవీలు లేదా వ్యక్తులపై సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని సీఐ సాగర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఈ తరహా మోసాలకు గురైన బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు.




