
ఏసీ గదుల్లో అధికారులు.. అనాథల్లా పేదలు.
*27 ఎకరాలు కాపాడామంటున్న కలెక్టర్..
కబ్జాదారులకు కట్టబెట్టింది ఎంత?
రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే పేదల ఇళ్ల కూల్చివేత.
ప్రభుత్వం ప్రకటించిన 15 రోజుల గడువు అంతా పొలిటికల్ డ్రామాయే.
ఏ చేతులతో గెంటేశారో.. అదే జాగలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.
ఖమ్మంలో మీడియాతో బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు.
ఖమ్మం, మార్చి 05:
నిరుపేదలను దయాదాక్షిణ్యం లేకుండా బయటకు గెంటివేసి, కనీస ప్రాథమిక వసతులు లేని అంబేద్కర్ భవన్‌లో అనాథల్లా వదిలేశారని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, నాయకులు ఏసీ గదుల్లో ప్రశాంతంగా కూర్చుంటే, నిరాశ్రయులైన పేదల ఉసురు తగులుతుందని వారు హెచ్చరించారు. గురువారం ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు సంయుక్తంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, బడా బాబులకు కొమ్ముకాస్తున్న అధికారుల ద్వంద్వ వైఖరిని వారు తీవ్రంగా ఎండగట్టారు.
రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే కూల్చివేతలు
పదేళ్లుగా అక్కడ నివసిస్తున్న పేదలను చూసీ చూడనట్లు వదిలేసిన యంత్రాంగం, ఉన్నపళంగా వందలాది మంది పోలీసులతో, జేసీబీలతో అర్ధరాత్రి దాడులకు తెగబడటం వెనుక భారీ రియల్ ఎస్టేట్ మాఫియా హస్తం ఉందని బీజేపీ నేతలు ఆరోపించారు. కొత్త కలెక్టరేట్ సమీపంలో ఉండటం వల్లే ఆ భూమి విలువ వందల కోట్లకు చేరిందని, ఆ కుబేరుల కోసమే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపారని విమర్శించారు. బడా బాబుల ఫామ్ హౌస్‌లు, అక్రమ భవనాలకు ముందుగా నోటీసులు ఇచ్చి వారు కోర్టు స్టేలు తెచ్చుకునేదాకా వేచి చూసే అధికారులు, పేదల గుడిసెల విషయంలో మాత్రం కనీస సమయం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇది కాంగ్రెస్ చెబుతున్న ‘ఇందిరమ్మ రాజ్యమా’ లేక పేదల పొట్టకొట్టే ‘బుల్డోజర్ రాజ్యమా’ అని నిలదీశారు.
భూదాన భూముల లెక్కలేవి కలెక్టర్ గారూ?
అనంతరం భూదాన భూముల లెక్కలపై అధికారుల తీరును బీజేపీ నేతలు తూర్పారబట్టారు. 1957 కాసరా పహాణీ ప్రకారం 57 ఎకరాలు ఉన్న సువిశాలమైన భూదాన భూమి ఇప్పుడు కేవలం 27 ఎకరాలకు ఎలా తగ్గిపోయిందని ప్రశ్నించారు. గతం నుంచి నేటి వరకు కొందరు పాలకులకు ఈ భూములను ధారాదత్తం చేశారని మండిపడ్డారు. సుమారు 250 కోట్ల విలువైన భూమిని కాపాడామని చెబుతున్న జిల్లా కలెక్టర్, చివరకు 27 ఎకరాలు మాత్రమే మిగిలిందని చెప్పడం వెనుక ఉన్న మతలబు ఏమిటో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ పూర్తిగా కాంగ్రెస్ నేతల కనుసన్నల్లో పనిచేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం నగర పరిధిలోని 8వ డివిజన్‌లో పట్టణ ప్రకృతి వనాలను బడా బాబులు ఆక్రమించుకొని దర్జాగా భవనాలు నిర్మిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వం ఆడుతున్నది పొలిటికల్ డ్రామా
బాధితుల ఆగ్రహాన్ని, ప్రతిపక్షాల ఒత్తిడిని దారి మళ్లించేందుకే ప్రభుత్వం పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతోందని నేతలు విమర్శించారు. మార్చి 15 నాటికి స్థలాలు, ఐదు లక్షల రూపాయలు ఇస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు కేవలం ‘డెడ్ లైన్ డ్రామా’ అని కొట్టిపారేశారు. అప్పులు చేసి ఇళ్లు నిర్మించుకున్న పేదల ఆర్థిక నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారని నిలదీశారు. పేదల నుంచి ముప్పై వేల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు వసూలు చేసిన దళారుల వెనుక ఉన్న అధికార పార్టీ పెద్దలను బహిర్గతం చేసి, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. అలాగే అక్రమ కట్టడాలైతే అప్పట్లో కరెంటు, నల్లా కనెక్షన్లు ఇచ్చిన అధికారులపై సస్పెన్షన్ వేటు ఎందుకు వేయలేదని లాజికల్ గా ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్, రెవెన్యూ విభాగాలు పూర్తిగా వైఫల్యం చెందాయా లేక పాలకుల కనుసన్నల్లోనే ఈ దందా నడిచిందా అని అనుమానాలు వ్యక్తం చేశారు.
అదే జాగలో పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న భూకబ్జాదారుల పాత్రపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు. అభాగ్యులైన పేదల ఇళ్లను కూల్చిన ఈ దారుణ ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, సీఎం రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ చేతులతో అయితే అమాయక ప్రజలను నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటివేశారో.. మరల అదే భూదాన ప్రాంతంలో నిరుపేదలందరికీ వంద గజాల చొప్పున స్థలాలు ఏర్పాటుచేసి పక్కా భవనాలు నిర్మించి ఇవ్వాలని స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇళ్లు ఇచ్చే వరకు, నిధుల కేటాయింపుపై స్పష్టమైన జీవో వచ్చే వరకు బీజేపీ ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గుత్తా వెంకటేశ్వర్లు, నాయకులు మందడపు సుబ్బారావు, రవిరాథోడ్, నకిరేకంటి వీరభద్రం, నెల్లూరి బెనర్జీ, శాసనాల సాయిరాం, మణికంఠ, వాకదాని రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.



