
విధులలో నిర్లక్ష్యం.. ఉపాధ్యాయుడు సస్పెండ్..
మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఇంగ్లీష్ టీచర్ సయ్యద్ ఖలీల్ పాషాపై వేటు పడింది.
వృత్తి పట్ల నిర్లక్ష్యం, క్రమశిక్షణా రాహిత్యం వంటి కారణాలతో ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి స్థానికంగా చర్చనీయాంశమైంది.
సయ్యద్ ఖలీల్ పాషా పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరుకాకపోవడమే కాకుండా.. తన గైర్హాజరీని దాచిపెట్టేందుకు హాజరు రిజిస్టర్‌ను తారుమారు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా.. బోధన విషయంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
ఈ ఫిర్యాదులపై జిల్లా విద్యాశాఖ లోతుగా విచారణ చేపట్టింది. తొలుత క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఖలీల్ పాషాను జడ్చర్ల మండలం పోలేపల్లి ఉన్నత పాఠశాలకు డిప్యూటేషన్‌పై బదిలీ చేశారు.
అయితే.. పాఠశాలలో ఉపాధ్యాయుల మధ్య జరిగిన గొడవలు, అంతర్గత కలహాలపై విచారించేందుకు ‘త్రీ మెన్ కమిటీ’ని రంగంలోకి దించారు.
గత వారం రోజుల క్రితం మిడ్జిల్ పాఠశాలను సందర్శించిన ఈ కమిటీ సభ్యులు.. క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించి.. ఉపాధ్యాయుడి బాధ్యతారాహిత్యాన్ని ధృవీకరిస్తూ జిల్లా కలెక్టర్‌కు సమగ్ర నివేదికను సమర్పించారు.
కమిటీ నివేదికను పరిశీలించిన కలెక్టర్, నిబంధనలను ఉల్లంఘించిన సయ్యద్ ఖలీల్ పాషాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశానుసారం సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.




