
సార్ మీ కాళ్లు మొక్కుతాం… జీతాలివ్వండి
Web desc : కాళ్లు మొక్కుతాం.. ఎన్ని రోజులు జీతాలు ఇవ్వకుండా ఉంటారు’ అంటూ కొందరు దివ్యాంగులు రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమాధికారి (డీడబ్ల్యూవో) లక్ష్మీరాజం కాళ్లపై పడిన సంఘటన చర్చనీయాంశమైంది.
శుక్రవారం డీడబ్ల్యూవో లక్ష్మీరాజం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్‌కు రాగా, ఈ విషయం తెలుసుకున్న జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని పెట్రోల్‌బంక్‌లో పనిచేసే దివ్యాంగ కార్మికులు తిరుపతి, లింగప్రసాద్, మన్మోహన్ తదితరులు అక్కడకు చేరుకుని జీతాలు ఇవ్వాలంటూ ఆయన కాళ్లపై పడ్డారు.
అనంతరం దివ్యాంగులు మీడియాతో మాట్లాడుతూ, 2024లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని పెట్రోల్ బంక్‌లో మొత్తం 24 మంది దివ్యాంగులను అప్పటి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నియమించారని తెలిపారు.
అయితే సంక్షేమ శాఖ అధికారి పర్యవేక్షణలో నడిచే బంక్‌లో ఆకస్మికంగా కొందరు దివ్యాంగులైన వర్కర్లను తొలగించి, పది మంది మాత్రమే ఉండాలని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ జీతాలు లెక్కచేసి ఇవ్వాలని కోరగా.. ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
జీతాలు లేక తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని చెప్పినా కనికరించడం లేదని వాపోయారు. దివ్యాంగులపై డీడబ్ల్యూవో నిర్దయగా ప్రవర్తించడం సరికాదన్నారు.
పది నెలలుగా జీతాలు లేవని, సీఎం రేవంత్‌రెడ్డి తమపై కరుణ చూపి న్యాయం చేయాలని, లేనిపక్షంలో కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు.



