
రైతు కార్యాలయంలో మందు పార్టీ రచ్చ రచ్చ.. బరితెగించిన ఉద్యోగులు
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతుసేవా సహకార సంఘం కార్యాలయాన్ని (సింగిల్ విండో) ఉద్యోగులు సిట్టింగ్ రూంగా మార్చి మందు పార్టీ చేసుకున్నారు.
ఏకంగా చైర్మన్ ఛాంబర్ లోనే దుకాణం తెరిచి మందు తాగారు. మంగళవారం అర్థరాత్రి వరకు మోత్కూరు సింగిల్ విండో కార్యాలయం తెరిచి ఉంచి యధేచ్ఛగా కార్యాలయంలోనే నలుగురు ఉద్యోగులు మందు తాగుతున్నారు.
మోత్కూరు సింగిల్ విండో కార్యాలయ ఉద్యోగులతో పాటు నల్లగొండ గ్రామీణ సహకార బ్యాంక్ మోత్కూరు బ్రాంచ్ ఉద్యోగి పృధ్వి, అడ్డగూడూరు సింగిల్విండో కంప్యూటర్ ఆపరేటర్ శివతో కలిసి నలుగురు ఉద్యోగులు మందు తాగుతున్న వారిలో ఉన్నారు.
విధులు ముగించుకుని కార్యాలయం మూసేసి వెళ్లాల్సిన ఉద్యోగులు ఇలా కార్యాలయంలోనే మందు పార్టీ చేసుకోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు చైర్మన్ ఛాంబర్కు ఏమాత్రం విలువ ఇవ్వకుండా చైర్మన్ టేబుల్పై మందు బాటిళ్లు, బజ్జీలు పెట్టుకుని తాగుతున్నారు.
పాలకవర్గాలు లేకపోవడం, ఉద్యోగులపై అజమాయిషీ లేకపోవడంతోనే ఇలా బరితెగించి కార్యాలయంలోనే మందు పార్టీలు చేసుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగిల్విండో కార్యాలయం చైర్మన్ ఛాంబర్లోనే మందు పార్టీ చేసుకున్న ఉద్యోగులపై ఉన్నతాధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.




