
మృత్యుపాశాల్లా వేలాడుతున్న 11 కేవీ తీగలు
ప్రమాదం జరిగాకే స్పందన – ముందస్తు చర్యలు ఎక్కడ?”
తీగలు తొలగించాలంటే డబ్బులా? మరి ప్రాణాల విలువ ఎంత చెప్పండి!
వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు… తొలగించాలంటే డబ్బులు డిమాండ్
ప్రాణహాని మధ్య కూలీలు పనులు – అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు ఏప్రిల్ 13 2026: ఏన్కూరు మండలం నాచారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 437లో రైతు బానోత్ పంతులు గల వ్యవసాయ పొలంలో వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు తీవ్ర ప్రాణహాని పరిస్థితులు సృష్టిస్తున్నాయి. కరివేపాకు తోట మధ్యగా పోల్ నెంబర్లు 70-72 మధ్య సుమారు అర కిలోమీటర్ మేర ఈ తీగలు నిరుపయోగంగా ఉండి నేలకు దగ్గరగా వేలాడుతున్నాయి.
గాలి, వర్షాల సమయంలో మరింత దిగువకు వంగి ప్రమాదకరంగా మారుతున్న ఈ తీగలు ఎప్పుడైనా ప్రాణాంతక ప్రమాదానికి దారి తీసే అవకాశముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పలుమార్లు అధికారులను సంప్రదించినప్పటికీ, “అక్కడ ఎలాంటి సమస్య లేదు” అంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
సమస్యను వివరించినా సీరియస్గా తీసుకోకుండా తేలికగా కొట్టేస్తున్నారని వాపోతున్నారు. ఇక ఈ తీగలను తొలగించాలని కోరితే డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలకు ముప్పు ఉన్న సమస్యను కూడా లాభాపేక్షతో చూడటం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
పొలంలో ప్రతిరోజూ 20 నుంచి 30 మంది కూలీలు వ్యవసాయ పనులు నిర్వహిస్తున్నారు. నేలకు దగ్గరగా ఉన్న హైటెన్షన్ తీగలు ఎప్పుడైనా తగిలే ప్రమాదం ఉండటంతో కూలీలు భయాందోళనకు గురవుతున్నారు.
అదే సమయంలో, ఎండాకాలం కావడంతో పశువులను మేతకు వదిలే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.
ఈ పొలాల పరిసర ప్రాంతాల్లో పశువులు స్వేచ్ఛగా తిరుగుతూ ఉండగా, వేలాడుతున్న విద్యుత్ తీగలు వాటికి కూడా ప్రాణహాని కలిగించే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. అనుకోకుండా తీగలు తగిలితే పశువులు మృతి చెందే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యులు ఎవరు?” అంటూ స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదం జరగకముందే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రజల ప్రాణాలు, పశువుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నిరుపయోగంగా ఉన్న విద్యుత్ తీగలు, స్తంభాలను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని కోరుతున్నారు. లేకపోతే ఈ నిర్లక్ష్యం ఎప్పుడైనా విషాదానికి దారి తీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.




