
సింగర్ మంగ్లీపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలి — ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (ఐఎన్ హెచ్ ఆర్ ఎఫ్)
సికె న్యూస్ ప్రతినిధి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (ఐఎన్ హెచ్ ఆర్ ఎఫ్) గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ డా. పీటర్ నాయక్ లకావత్ మాట్లాడుతూ, ప్రముఖ గాయని మంగ్లీ, హేమకాంత్ రెడ్డి మరియు రామావత్ మధు పేర్లు వెలుగులోకి వస్తున్న భారీ ఆర్థిక మోసం ఆరోపణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు మరియు అమాయక పెట్టుబడిదారుల నుండి సుమారు రూ.1500 కోట్ల నుండి రూ.2000 కోట్ల వరకు భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న ఆరోపణలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే సమగ్ర, పారదర్శక దర్యాప్తు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంలో బాధితుల నుండి సేకరించిన నిధులను ట్రేస్ చేసి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను గుర్తించి, వాటిని సీజ్ చేసి, బాధితులకు డబ్బు రికవరీ జరిగేలా చర్యలు తీసుకోవాలని డా. పీటర్ నాయక్ లకావత్ కోరారు.
అలాగే, ఈ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే 9 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని లేదా అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారని వస్తున్న వార్తలపై కూడా పూర్తిస్థాయి విచారణ జరగాలని ఆయన పేర్కొన్నారు.
ఆ మరణాలు నిజంగా ఈ ఆర్థిక మోసాలకు సంబంధించిందేనా?
వాళ్లు ఎందుకు ప్రాణాలు కోల్పోయారు?
వారిపై ఆర్థిక లేదా మానసిక ఒత్తిడులు ఉన్నాయా?
అనే అంశాలపై లోతైన దర్యాప్తు జరగాలని ఆయన తెలిపారు.
అదేవిధంగా, ఈ మరణాల విషయంలో మంగ్లీ మరియు ఆమె బృందం ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో తేలితే, శివ, రామావత్ మధు, హేమకాంత్ రెడ్డి మరియు ఇతర సంబంధిత వ్యక్తులు పూర్తి బాధ్యత వహించాలని డా. పీటర్ నాయక్ లకావత్ పేర్కొన్నారు.
ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా, నేరాలకు పాల్పడిన వారివద్ద నుండి చట్టపరంగా ఆస్తులు మరియు నిధులను రికవరీ చేసి, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, పునరావాసం మరియు భద్రత కల్పించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అనంతరం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (ఐఎన్ హెచ్ ఆర్ ఎఫ్) డిప్యూటీ హై కమిషనర్ డా. ప్రవీణ్ రావు మాట్లాడుతూ, సింగర్ మంగ్లీకి సంబంధించిన ఈ స్కాంలో పూర్తిస్థాయి నిజానిజాలు బయటకు వచ్చే వరకు — ఏమి జరిగింది? ఎక్కడ ప్రారంభమైంది? ఎంతమంది ఇందులో తెరవెనుక ఉండి ఈ వ్యవహారాన్ని నడిపించారు? — అనే ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని దుర్వినియోగం చేసి భారీ మొత్తంలో డబ్బులు సేకరించి మోసాలకు పాల్పడిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు ఎవరూ పెద్దవారు కాదు. బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని అత్యంత ప్రాధాన్యంతో తీసుకోవాలి” అని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా,
ప్రజల నుండి సేకరించిన డబ్బులు నిజంగా మంగ్లీకి నేరుగా చేరాయా?
లేక మధ్యవర్తుల ద్వారా చేరాయా?
ఏ ఒప్పందాలు లేదా హామీల ఆధారంగా డబ్బులు సేకరించబడ్డాయి?
ఆ డబ్బులు ఏ ఖాతాలకు బదిలీ చేయబడ్డాయి?
అనే అంశాలపై కూడా సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కేసులో తెలంగాణ డీజీపీ, పోలీస్ అధికారులు మరియు ఎన్‌ఫోర్స్‌మెంట్ సంస్థలు పారదర్శక విచారణ నిర్వహించాలని, అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ డి) మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సంస్థలను కూడా దర్యాప్తులో భాగస్వామ్యం చేయాలని ఆయన కోరారు.
ఇప్పటికే మోసపోయిన అమాయక గిరిజన ప్రజల పక్షాన నిలబడి, బాధితులకు న్యాయం జరిగేలా పోరాడుతున్న పలువురు గిరిజన నాయకుల కృషిని కూడా మా గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ డా. పీటర్ నాయక్ లకావత్ గారి ద్వారా ప్రత్యేకంగా అభినందిస్తున్నామని డిప్యూటీ హై కమిషనర్ డా. ప్రవీణ్ రావు తెలిపారు. ప్రత్యేకంగా సంపత్ నాయక్, అశోక్ రాథోడ్ మరియు ప్రత్యూష గార్లు బాధితుల తరఫున చేస్తున్న పోరాటం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే, ఈ అంశాన్ని ప్రజల ముందుకు తీసుకువస్తూ నిజాలను వెలుగులోకి తీసుకురావడంలో సహకరిస్తున్న మీడియా మిత్రులకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాన డిమాండ్లు: బాధితుల ఫిర్యాదులను వెంటనే నమోదు చేసి, ప్రతి కేసులో చట్టబద్ధంగా ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసి వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలి.
అన్ని బ్యాంక్ లావాదేవీలు, ఆస్తులు, పెట్టుబడి రికార్డులు, షెల్ కంపెనీలు మరియు అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలను తక్షణమే సీజ్ చేసి, ఫోరెన్సిక్ ఆడిట్ ద్వారా పూర్తిస్థాయిలో పరిశీలించాలి.
అక్రమంగా సంపాదించిన ఆస్తులు, భూములు, బ్యాంక్ డిపాజిట్లు మరియు బినామీ ఆస్తులను గుర్తించి, చట్టపరంగా అటాచ్ చేసి, బాధితులకు డబ్బు రికవరీ జరిగేలా చర్యలు తీసుకోవాలి.
బాధితుల మరణాలపై ప్రత్యేక సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేసి, ఆ మరణాల వెనుక ఉన్న ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక వేధింపులు, బెదిరింపులు మరియు అనుమానాస్పద పరిస్థితులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహించాలి.
గిరిజన ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఆర్థిక మోసాలు మరియు అక్రమ పెట్టుబడి పథకాలపై ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేసి, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (ఐఎన్ హెచ్ ఆర్ ఎఫ్) హై కమిషనర్ డా. సి. హెచ్. విజయ్ మోహన్ రావు మాట్లాడుతూ, ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలుపంచుకున్న ప్రతి వ్యక్తి, మధ్యవర్తి, ఆర్థిక భాగస్వామి మరియు సహకరించిన నెట్‌వర్క్‌పై సమగ్ర విచారణ జరిపి, వారిని చట్టం ముందు నిలబెట్టాలని అన్నారు.
చివరిగా డా. పీటర్ నాయక్ లకావత్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ:
“అధిక లాభాలు, తక్కువ సమయంలో డబ్బు రెట్టింపు అవుతుందని చెప్పే మాటలను నమ్మి ఎవరూ తమ కష్టార్జిత సంపాదనను పెట్టుబడి పెట్టవద్దు. చట్టబద్ధ అనుమతులు, అధికారిక రిజిస్ట్రేషన్లు మరియు ప్రభుత్వ ధృవీకరణలు పరిశీలించిన తరువాత మాత్రమే పెట్టుబడులు పెట్టాలి” అని సూచించారు.
అధిక వడ్డీలకు ఆశించి డబ్బులు ఇవ్వడం కూడా నేరమే కాబట్టి, ప్రజలు మరోసారి ఇటువంటి వ్యక్తులు మరియు సంస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.




