
మహిళపై ఎస్ఐ లైంగిక దాడి… ఎస్ఐపై పోలీసులు కేసు నమోదు
Social media viral : హనుమకొండ: సమాజంలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న ఓ ఎస్ఐ.. మహిళపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది.
లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో, సదరు ఎస్ఐపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎస్ఐ శ్రీకాంత్ కరీంనగర్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. శ్రీకాంత్‌కు 2025 సంవత్సరంలో ఫేస్బుక్ ద్వారా వరంగల్‌కు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో, వారి మధ్య స్నేహం ఏర్పడింది.
ఈ క్రమంలో సదరు మహిళ వ్యక్తిగత విషయాలను తెలుసుకున్న ఎస్ఐ.. ఆమె ఒంటరిగా నివసిస్తున్న విషయాన్ని గ్రహించాడు. ఆమె బలహీనతను ఆసరాగా చేసుకొని.. ఎలాగైనా లొంగ తీసుకోవాలని ఎస్ఐ ప్లాన్ చేశాడు. ఇటీవల శ్రీకాంత్ వరంగల్‌కు వచ్చి.. బాధితురాలికి ఫోన్ చేశాడు.
ఈ క్రమంలో ఆమె లొకేషన్ అడిగి తెలుసుకున్నాడు. మాయ మాటలు చెప్పి ఆమె ఇంటికి వెళ్లిన శ్రీకాంత్.. అక్కడ ఆమెపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించినా బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.
అధికారంతో పాటు బలాన్ని ఉపయోగించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అనంతరం, బాధితురాలు ధైర్యం చేసి సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం బయటపడింది. బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న పోలీసులు..
ఎస్ఐ శ్రీకాంత్‌పై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. ఒక పోలీస్ అధికారిపైనే లైంగిక దాడి కేసు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. ఎస్ఐ శ్రీకాంత్‌పై అంతకుముందు కూడా పలు ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల ఇసుక వివాదంలో శ్రీకాంత్ సస్పెండ్ అయ్యారు. ఈనెల రెండో తేదీనే శ్రీకాంత్ జమ్మికుంట ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. ఇలా బాధ్యతలు చేపట్టిన 16 రోజులకే శ్రీకాంత్‌పై లైంగిక దాడి కేసు నమోదు కావడం గమనార్హం.




