
పారాణి ఆరకముందే.. నవ దంపతుల ఆత్మహత్య
Web desc : ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్న నవ దంపతుల జీవితం అనుమానం అనే పెనుభూతంతో విషాదాంతమైంది. భార్య ఆత్మహత్య చేసుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే భర్త కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలో ఆదివారం చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొండపాక మండల కేంద్రానికి చెందిన దండ్ల లహరి (21), కొమురవెల్లి గ్రామానికి చెందిన దేశెట్టి వినయ్ (23) గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల అంగీకారంతో ఈ ఏడాది ఏప్రిల్ 9న వీరి వివాహం జరిగింది. ఉపాధి నిమిత్తం 15 రోజుల క్రితం ఈ దంపతులు హైదరాబాద్‌కు వెళ్లారు.
అయితే లహరి వేరొకరితో ఫోన్‌లో మాట్లాడుతోందన్న అనుమానం వినయ్‌లో పెరిగింది. ఈ క్రమంలో దంపతుల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. అనంతరం కడుపునొప్పి నెపంతో ఈ నెల 7న లహరిని ఆమె పుట్టింటి వద్ద దించి వినయ్ తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయాడు.
భార్య ఆత్మహత్య.. గంటల్లోనే భర్త బలవన్మరణం
భర్త తనను అనుమానిస్తూ తిడుతున్నాడన్న మనస్తాపంతో లహరి ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న వినయ్ హైదరాబాద్ నుంచి బైక్‌పై హుటాహుటిన బయలుదేరాడు.
భార్య మరణానికి తానే కారణమన్న భావనతో పాటు చట్టపరమైన చిక్కులు వస్తాయనే భయంతో గజ్వేల్ మండలం కొడకండ్ల శివారుకు చేరుకుని కుటుంబ సభ్యులకు తన లొకేషన్‌ను షేర్ చేశాడు. అనంతరం అక్కడే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒకే రోజు భార్యాభర్తలు మృతి చెందడంతో కొండపాక, కొమురవెల్లి గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లయి నెల రోజులు కూడా గడవకముందే నవ దంపతులు విగతజీవులుగా మారడం స్థానికులను కలచివేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన కుకునూరుపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




