
ప్రశ్నిస్తే హింసను ప్రేరేపించేలా సీఎం ప్రవర్తన
చంద్రబాబుకు ఉన్న నీటి సోయి రేవంత్‌కూ రావాలి
ఉచిత కరెంటును ఎత్తేయడానికే కొత్త డిస్కం
సీతారామ ప్రాజెక్టుపై ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని పువ్వాడ డిమాండ్
భద్రాచలం ముంపుకు కారణం పోలవరం
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ తో హింసని ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. భద్రాది కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎల్ నినో ప్రభావంతో కరువు వస్తుందని మాట్లాడితే రక్తంతో పంటల పండించాలని సీఎం మాట్లాడడం విడ్డూరంగా ఉందని సూచనలు చేసే వారిని రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారని విమర్శించారు. వానాకాలంలో రైతు బంధు ఎగ్గొట్టారని 6 సీజన్లలో 3 సీజన్లు రైతుబంధు వేయలేదని షాప్ లో దొరికే యూరియాని యాప్ లో పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
నాలుగున్నర లక్షల ఆయకట్టు రైతుల కోసం సీతారామ ప్రాజెక్టుకి బీఆర్ఎస్ ప్రభుత్వం 9వేల కోట్లు ఖర్చు చేసిందని రెండున్నర ఏళ్లలో కనీసం 100 కోట్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదని, ఎంత ఖర్చు పెట్టారో ఎన్ని నిధులు మంజూరు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రేవంత్‌రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరిందని నాటి సమైక్య పాలకుల వలె తెలంగాణకు అన్యాయం చేస్తూ పరిపాలిస్తున్నారని, పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు.
రైతులకు 24 గంటలు కేసిఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్తును ఎత్తేయడానికి కొత్త డిస్కంను ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భద్రాచలం మునిగిపోయే ప్రమాదం ఉందని కాళేశ్వరం వల్ల కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలని అన్నారు.
తెలంగాణ నీటిని సద్వినియోగం చేసుకోవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ నుంచి దిగువకు పోతున్న నీటిని ఆంధ్రప్రదేశ్ లో పట్టిసీమతో చంద్రబాబు కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారని గురువుకు ఉన్న సోయి చూసి తెలంగాణలో నీటిని వాడుకునే సోయిలోకి రేవంత్ రెడ్డి రావాలని తెలంగాణ రైతులు, ప్రజల ప్రయోజనాలపై దృష్టి సారించాలని అన్నారు. తెలంగాణ ప్రజలకు రైతులకు అన్యాయం చేయవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.




