
ఏరియా ఆసుపత్రిలో విషాదం.. ‘స్పర్శ’ లేకుండా శిశువు జననం
హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. పుట్టుకతోనే ఎటువంటి కదలికలు లేని (స్పర్శ లేని) శిశువు జన్మించగా..మెరుగైన చికిత్స కోసం ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
వివరాల్లోకి వెళ్తే.. ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి అర్చన అనే మహిళ తన రెండో కాన్పు కోసం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చేరింది.
కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం (నార్మల్ డెలివరీ) చేశారు. అయితే, శిశువు బయటకు వచ్చే సమయంలో బొడ్డు పేగుతో కలిసి రావడమే కాకుండా, ఎటువంటి స్పర్శ లేకుండా పుట్టింది.
ప్రాణాలు నిలవని వైనం.. శిశువు పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రిఫర్ చేశారు. కాగా, కుటుంబ సభ్యులు శిశువును ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు చిన్నారి బతికే అవకాశాలు తక్కువని స్పష్టం చేశారు.
దీంతో చేసేదేమీ లేక తిరిగి హుజూరాబాద్‌కు తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే శిశువు మృతి చెందింది. ఈ ఘటనతో బాధితురాలి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఈ ఘటనపై హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణ రెడ్డిని వివరణ కోరగా.. “మహిళకు సాధారణ ప్రసవం చేసే క్రమంలోనే నొప్పులు వచ్చి శిశువు జన్మించింది. అయితే శిశువు బొడ్డు పేగుతో కలిసి రావడంతో పాటు స్పర్శ లేకుండా ఉండటంతో వెంటనే ఎంజీఎంకు రిఫర్ చేశాం. కానీ దురదృష్టవశాత్తు శిశువు మృతి చెందినట్లు తెలిసిందని” ఆయన వివరించారు.




