
భర్త కళ్లముందే భార్య దారుణ హ*త్య.. సంగారెడ్డిలో సంచలనం
Web desc : సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని గండిగూడెం క్రీడా ప్రాంగణం సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు మహిళను హత్య చేయడం తీవ్ర కలకలం రేపింది. భర్త కళ్లముందే భార్యను పొదల్లోకి లాక్కెళ్లి గొంతు కోసి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి రావడం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. భార్యాభర్తలు అనిల్ కుమార్, మీనా దేవి (35) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గండిగూడెం క్రీడా ప్రాంగణం వద్ద వారి బైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఈ క్రమంలో పొదల్లో దాక్కున్నట్లు భావిస్తున్న కొందరు దుండగులు ఒక్కసారిగా బయటకు వచ్చి మీనా దేవిని బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లినట్లు తెలుస్తోంది.

భార్యను రక్షించేందుకు ప్రయత్నించిన భర్త అనిల్ కుమార్ను దుండగులు అడ్డుకుని కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం అతని కళ్లముందే మీనా దేవి గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలపాలైన అనిల్ కుమార్ను స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
ఘటన సమాచారం అందుకున్న బొల్లారం పోలీసులు, క్లూస్ టీమ్ ఘటనాస్థలికి చేరుకుని ఆధారాలు సేకరించినట్లు సమాచారం. హత్యకు గల కారణాలపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తిగత విభేదాలు, పాత కక్షలు లేదా ముందస్తు ప్రణాళికతో దాడి జరిగిందా అనే అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే, పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.
ఈ దారుణ ఘటనతో ఐడీఏ బొల్లారం పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు రాత్రి వేళల్లో భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
గమనిక: పోలీసుల అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.




