
హైదరాబాద్‌లో ఎబోలా కలకలం.. రెండు అనుమానిత కేసులు! అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఎబోలా వైరస్ అనుమానిత కేసుల సంఖ్య రెండుకు చేరుకోవడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. మధ్య ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తుండగా, తాజాగా సూడాన్‌కు చెందిన మరో వ్యక్తిలో వైరస్‌కు సంబంధించిన లక్షణాలు కనిపించాయి.
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సూడాన్‌కు చెందిన మహమ్మద్ యగౌచ్ అహ్మద్ (36) ఇటీవల హైదరాబాద్‌కు చేరుకున్నాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నిర్వహించిన సాధారణ వైద్య పరీక్షలు, స్క్రీనింగ్ సమయంలో అతడిలో ఎబోలా వైరస్‌కు సంబంధించిన అనుమానాస్పద లక్షణాలను అధికారులు గుర్తించారు. వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించి ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అహ్మద్ నగరంలోని ఓ విద్యాసంస్థలో చదువుతున్నట్లు సమాచారం. అలాగే ఎబోలా లక్షణాలతో ఉన్న వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తిని కూడా ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరికీ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. గాంధీ ఆస్పత్రిలో ఎబోలా నోడల్ అధికారి డాక్టర్ సునీల్‌కుమార్ మాట్లాడుతూ.. రోగి నుంచి సేకరించిన రక్త నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మొలెక్యూలర్ బయాలజీకు పంపినట్లు తెలిపారు. అక్కడి నుంచి నమూనాలను నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ, పుణేకు తరలించనున్నట్లు చెప్పారు. తుది పరీక్షా ఫలితాలు వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
ఎబోలా వైరస్ నిర్ధారణ అయ్యే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ఆస్పత్రిలో 20 పడకల ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే జ్వరం, తీవ్రమైన అలసట, రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల స్క్రీనింగ్‌ను మరింత కట్టుదిట్టం చేసింది




