
ఖమ్మంలో మైనర్ బాలికపై అమానుషం.
- నిందితుడిని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి.
- బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు డిమాండ్.
ఖమ్మం,జూన్ 09.
ఖమ్మం రాపర్తి నగర్లోని జీ ప్రైడ్ అపార్ట్మెంట్లో 12 ఏళ్ల బాలికపై జరిగిన దారుణ అత్యాచారం, హత్యాయత్నం ఘటనను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండించింది. మంగళవారం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని, ఆమె తల్లిదండ్రులను బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు పరామర్శించారు. ఈ హృదయ విదారక ఘటనపై ఆయన తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అపార్ట్మెంట్లో రెండో అంతస్తులో నివాసం ఉంటున్న 42 ఏళ్ల మహ్మద్ గౌస్ పాషా అనే మృగాడు 12 సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు. బాలిక ప్రతిఘటించడంతో కిరాతకంగా అపార్ట్మెంట్ పైనుంచి కిందకు తోసేశాడని, దీంతో ఆ పసిపాప రెండు చేతులు, వెన్నెముక విరిగిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతటి ఘాతుకానికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కేవలం పోక్సో కేసు మాత్రమే నమోదు చేసి, అతనికి రక్షణ కల్పిస్తున్నారని కోటేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు.ఇలాంటి మృగాలకు, మూర్ఖులకు చట్టపరమైన సాధారణ శిక్షలు ఏమాత్రం సరిపోవని, నిందితుడిని తక్షణమే బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎన్కౌంటర్ లాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటి అకృత్యాలకు పాల్పడేవారి వెన్నులో వణుకు పుడుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ చిన్నారికి మెరుగైన, అత్యవసర వైద్యం అందించడం కోసం తక్షణమే ఆమెను హైదరాబాద్కు తరలించాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు ఆయన విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబానికి బీజేపీ సంపూర్ణ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఆయన భరోసా ఇచ్చారు.
ఖమ్మం జిల్లాలో హిందూ మైనర్ బాలికలకు రక్షణ కరువైందని కోటేశ్వరరావు మండిపడ్డారు. పథకం ప్రకారం లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేయడం, దాడులకు పాల్పడటం వంటి ఘటనలు జిల్లాలో సర్వసాధారణంగా మారిపోయాయని ఆయన ఆరోపించారు. గతంలో బోనకల్లు, అలాగే ఓ మదర్సా సమీపంలో జరిగిన ఇలాంటి దారుణాలను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆయా ఘటనల్లో దోషులకు సరైన శిక్షలు పడకపోవడం, కేసులను కప్పిపుచ్చే ప్రయత్నాలు జరగడం వల్లే నేరస్థులు రెచ్చిపోతున్నారని విమర్శించారు.
హిందూ బాలికలు, మహిళల పట్ల దాడులు పునరావృతమైతే ఇకపై ఏమాత్రం చూస్తూ ఊరుకోమని, అలాంటి మృగాలను నడిరోడ్డుపై ఉరికిచ్చి కొడతామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఏ ఆడబిడ్డకు కూడా ఇలాంటి గతి పట్టకూడదని ఆయన ఆకాంక్షించారు. దీనికితోడు నగరంలో గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలు, వాడకం విచ్చలవిడిగా పెరుగుతున్నాయని, నేరాలు పెరగడానికి ఇవి కూడా కారణమవుతున్నాయని పేర్కొన్నారు.
పోలీసులు తక్షణమే స్పందించి ఈ మాదకద్రవ్యాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరి వెంట జిల్లా ఉపాధ్యక్షులు నకరికంటి వీరభద్రం, మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పమ్మి అనిత, మంద సరస్వతి, శ్రీరామనని మణి, పని కుమారి, నాగమణి, స్వర్ణ, మీడియా కన్వీనర్ నెల్లూరి బెనర్జీ, జిల్లా కోశాధికారి కొణతం లక్ష్మీనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, నలమాస్ శ్రీను, శాసనాల సాయిరాం, వాకగాని రామకృష్ణ, గోనెల శివ తదితరులు ఉన్నారు.




