
అధికార దర్పం: అటెండర్లతో ఎంపీడీవో కారు కడిగింపు!
ఫరూక్ నగర్ ఎంపీడీవో కార్యాలయంలో వెలుగుచూసిన అధికార దుర్వినియోగం
ఎంపీడీవో కార్యాలయమా..? లేక అధికారి కారు షెడ్డా..?
ఫరూక్ నగర్ ఎంపీడీవో శ్రీకాంత్ అధికార దర్పం.. కింది స్థాయి సిబ్బందితో వెట్టిచాకిరీ!
మహిళా అటెండర్‌తో బహిరంగంగా కారు కడిగింపు.. భగ్గుమంటున్న జనం
social media viral : ఫరూక్ నగర్ (రంగారెడ్డి జిల్లా) : ప్రజా సేవ చేయాల్సిన అధికారుల తీరు రోజురోజుకూ దిగజారుతోంది. ప్రభుత్వ కార్యాలయాలను తమ సొంత జాగీరులా భావిస్తూ, కింది స్థాయి సిబ్బందిని తమ పర్సనల్ పనివాళ్లుగా వాడుకుంటున్న ఫరూక్ నగర్ ఎంపీడీవో శ్రీకాంత్ నిర్వాకం బట్టబయలైంది. ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఏకంగా ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయం ముందే సాక్షాత్తూ ఎంపీడీవో తన కారును అటెండర్లతో కడిగించుకోవడం ఆయన అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.
అటెండర్లకు జీతాలిచ్చేది మీ కారు కడగడానికా శ్రీకాంత్ గారూ..? ప్రజా ధనంతో ప్రభుత్వ పనుల్లో సహాయపడటం కోసం నియమించబడిన అటెండర్లను ఎంపీడీవో తన వ్యక్తిగత సేవకులుగా వాడుకుంటున్నారు. కార్యాలయం ముందే అందరూ చూస్తుండగా, రామ్మోహన్ అనే అటెండర్‌తో పాటు, ఒక మహిళా అటెండర్‌ను కూడా తన కారు శుభ్రం చేసే పనికి పురమాయించడం తీవ్ర దుమారం రేపుతోంది.
ప్రభుత్వ ఫైళ్లు అందిస్తూ అధికారులకు, ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన మహిళా ఉద్యోగితో.. నడిరోడ్డుపై పైపులు పట్టించి కారు కడిగించడం మహిళా లోకాన్ని, ఉద్యోగ వ్యవస్థను కించపరచడమే. ఇది సర్వీస్ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, అమానవీయం కూడా.
ఉన్నతాధికారుల కళ్లు మూసుకుపోయాయా..?
ఒక మండల స్థాయి అధికారి ఇంత బరితెగించి కార్యాలయం ముందే వెట్టిచాకిరీ చేయించుకుంటుంటే వ్యవస్థ ఏమైపోయినట్లు? ఆధారాలతో సహా దొరికిపోయిన ఈ అధికారిపై చర్యలు తీసుకోకపోతే, ఇక ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల ప్రైవేట్ ప్రాపర్టీలుగా మారిపోక తప్పదు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు తక్షణమే ఈ ఘటనపై స్పందించి సమగ్ర విచారణ జరపాలి. కింది స్థాయి సిబ్బందితో, అందులోనూ ఓ మహిళా అటెండర్‌తో బలవంతంగా కారు కడిగించుకున్న ఎంపీడీవో శ్రీకాంత్ పై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, వెంటనే ఆయన్ను సస్పెండ్ చేయాలని ప్రజలు మరియు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకునే దమ్ము అధికారులకు ఉందా లేదా అన్నది ఇప్పుడు వేచి చూడాలి!




