HealthPoliticalTelanganaWarangal

స్టిక్కర్ పేరుతో లిక్కర్ దందా..?

స్టిక్కర్ పేరుతో లిక్కర్ దందా..?

స్టిక్కర్ పేరుతో లిక్కర్ దందా..?

ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనపు వసూళ్లు

వైన్ షాపుల్లో లభించని బ్రాండ్లు బెల్ట్ షాపుల్లో ఎలా అందుబాటులోకి వస్తున్నాయనే అనుమానాలు

ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?

అధికారులు మౌనం ఎందుకు వీడటం లేదు..?

ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు అందుతున్నాయా…?

పాలకుర్తి/రాయపర్తి(ck న్యూస్) ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో మద్యం విక్రయాల వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మండలంలోని శివ బాలాజీ, భద్రకాళి, కసా వైన్స్ నిర్వాహకులు మద్యం విక్రయాల్లో నిబంధనలను పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా “స్టిక్కర్” పేరుతో ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు అదనంగా వసూలు చేస్తూ బెల్ట్ షాపులకు వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికుల కథనం ప్రకారం, ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు మించి డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

బెల్ట్ షాపులకు మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చిన వినియోగదారులు అదనపు ధరలు చెల్లించి కొనుగోలు చేస్తూ గ్రామాలలో లోకి తీసుకెళ్లి మళ్ళీ అదనంగా బెల్ట్ షాపు నిర్వాహకులు అదనంగా ఒక్కో బాటిల్ పై 30 నుండి 50 రూపాయల వరకు బ్రాండ్ ను బట్టి అమ్మకాలు జరుపుతున్నారు.

సామాన్య ప్రజలు పొద్దంతా కష్ట పడి వొచ్చి బెల్ట్ షాపులకు పరిమితం అవ్వడం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అని స్థానికులు చెప్పుకొచ్చారు.ఇంత జరుగుతున్న కూడా ఎక్సైజ్ అధికారులు మాత్రం మౌనం వీడటం లేదు.

బెల్ట్ షాపులకు ప్రత్యేక సరఫరా..?

రాయపర్తి మండలంలో బెల్ట్ షాపుల వ్యవహారం కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. వైన్ షాపుల్లో అందుబాటులో లేవని చెప్పే కొన్ని బ్రాండ్లు, అదే సమయంలో బెల్ట్ షాపుల్లో మాత్రం సులభంగా లభిస్తున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దీంతో వైన్ షాపుల నుంచే బెల్ట్ షాపులకు ప్రత్యేకంగా మద్యం సరఫరా జరుగుతోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెల్ట్ షాపుల నిర్వాహకుల నుంచి అధిక మొత్తంలో నగదు తీసుకొని మద్యం విక్రయాలు జరుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సంబంధిత శాఖల పర్యవేక్షణ లోపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఎక్సైజ్ అధికారుల పాత్రపై ప్రశ్నలు

సాధారణంగా అక్రమ మద్యం విక్రయాలు, బెల్ట్ షాపుల నిర్వహణ, ధరల ఉల్లంఘనలపై తనిఖీలు నిర్వహించాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖ అధికారులదే. అయితే రాయపర్తి మండలంలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. బెల్ట్ షాపులపై తనిఖీలు నిర్వహించడం, స్టిక్కర్లు పరిశీలించడం వంటి చర్యలు అధికారుల కంటే వైన్ షాపుల నిర్వాహకులే చేపడుతున్నారనే వార్తలు స్థానిక ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అధికారుల అధికారాలను ప్రైవేట్ వ్యక్తులు వినియోగిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తనిఖీలు ఎందుకు లేవు..?

మండలంలోని పలు వైన్ షాపులపై తరచూ ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఇప్పటివరకు సమగ్ర తనిఖీలు నిర్వహించకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదనపు ధరల వసూళ్లు, బెల్ట్ షాపులకు మద్యం సరఫరా, స్టిక్కర్ వ్యవహారం వంటి అంశాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు. అన్ని ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు..?,మద్యం విక్రయాల్లో జరుగుతున్న అవకతవకలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం ఎందుకు..? అనే ప్రశ్నలు ప్రజల నుంచి వస్తున్నాయి.

స్థానికుల డిమాండ్

రాయపర్తి మండలంలోని మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి, వైన్ షాపులు మరియు బెల్ట్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అదనపు ధరల వసూళ్లు, అక్రమ సరఫరా ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే మద్యం విక్రయాల్లో పారదర్శకత తీసుకువచ్చి, వినియోగదారుల నుంచి ప్రభుత్వ నిర్ణయించిన ధరలకే విక్రయాలు జరిగేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button