
మా జోలికి వస్తే మీ రాజకీయ సమాధికి మేమే డప్పులు కొడతాం:కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఎమ్మెల్యే మందుల సామేల్ వార్నింగ్
web desc : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి పార్టీలో కీలకంగా ఎదిగారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అలాగే మనుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ నుంచే రాజకీయం ప్రారంభించినప్పటికీ మధ్యలో బీజేపీలో చేరి మళ్లీ సొంతగూటికి వచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో తిరుగులేని నాయకులుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా దూసుకుపోతుంటే…మంత్రి పదవి దక్కలేదని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పార్టీపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఇలాంటి తరుణంలో వీరికి అంతర్గతపోరు ఇబ్బందికరంగా మారింది. తాజాగా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కోమటిరెడ్డి బ్రదర్స్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.కోమటిరెడ్డి బ్రదర్స్‌కి ఎస్సీ నియోజకవర్గమంటే చిన్న చూపు అని విమర్శించారు. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో మీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. మా నియోజకవర్గాల జోలికి రాకుండా ముందు మీ నియోజకవర్గాల మురికి కడుక్కోండి అని ఎమ్మెల్యే మందుల సామేల్ హెచ్చరించారు.
మీ దగ్గర మేం చేతులు చాచి గెలవలేదు కోమటిరెడ్డి రెడ్డి బ్రదర్స్‌పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా మీ రాజ్యం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు.ఎస్సీ నియోజకవర్గాలంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌కు చిన్నచూపు అని మండిపడ్డారు. తమ గురించి ఎందుకు హీనంగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే వేముల వీరేశం 60వేల మెజారిటీతో, తాను 52వేల మెజారిటీతో గెలిచామని…తాము మీ దగ్గర మేము చేతులు చాచి గెలవలేదే అంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలు బాగాలేవు అని అంటున్నాడు.. ముందు ఆయన మునుగోడు మురికి కడుక్కోవాలని హితవు పలికారు. మునుగోడులో అభివృద్ధి జరగలేదు, పరిస్థితి బాగాలేదని తనకు కూడా రిపోర్ట్ వచ్చింది.దీనిపై రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే మందుల సామేల్ డిమాండ్ చేశారు.
కనీస ప్రోటోకాల్ పాటించకపోతే ఎలా? తుంగతుర్తి నియోజకవర్గంలో తనకు సమాచారం లేకుండా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎలా పర్యటిస్తారని ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘తుంగతుర్తికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడనే విషయం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియడం లేదు. స్థానిక శాసనసభ్యుడినైన నాకు తెలియకుండా నా నియోజకవర్గానికి ఎలా వస్తారు? కనీస ప్రోటోకాల్ పాటించరా? అని ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రశ్నించారు.
కోమటిరెడ్డికి ఎస్సీ నియోజకవర్గాలంటే చిన్నచూపని, మాదిగలపై వివక్ష చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. మాదిగలు ఎవరికీ బానిసలు కాదని స్పష్టం చేసిన ఆయన, ఇదే తరహా పద్ధతి కొనసాగితే మర్యాద ఉండదని హెచ్చరించారు. ఈ ప్రోటోకాల్ ఉల్లంఘనపై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గేలకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే మందుల సామేల్ హెచ్చరించారు.
మా జోలికి వస్తే మీ రాజకీయ సమాధికి మేమే డప్పులు కొడతాం
కోమటిరెడ్డి బ్రదర్స్ తమ గౌరవానికి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని, అంతకు అంత ప్రతికారం తీర్చుకుంటామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.’మా జోలికొస్తే మీ రాజకీయ సమాధికి మేమే డప్పులు కొడతాం. మా దండోరా మోగుతుంది. అహంకార పూరితమైన రాజకీయాన్ని చావుదెబ్బ తీస్తాం’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.




