
విలేకరికి ప్రాణహాని..? రిపోర్టర్‌పై రెక్కీ కలకలం…
అక్రమాలపై కథనాలు ప్రచురించిన జర్నలిస్టును లక్ష్యంగా చేసుకున్నారనే ఆరోపణలు…
పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి భద్రత కల్పించాలని డిమాండ్…
సి కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి
ఆగస్టు 04,
అక్రమ ఇసుక రవాణా, గిరిజన భూముల కబ్జాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ అంశాలపై వరుసగా వార్తా కథనాలు ప్రచురిస్తున్న ఓ స్థానిక విలేకరికి ప్రాణహాని ఉందనే ఆరోపణలు లక్ష్మీదేవిపల్లి మండలంలో కలకలం రేపుతున్నాయి. మాజీ వైస్ ఎంపీపీ కుమారులు తనపై నిఘా పెట్టించి రెక్కీ నిర్వహిస్తున్నారని బాధిత విలేకరి ఆరోపించారు. ఈ వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారగా, జర్నలిస్టు వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
బాధిత విలేకరి తెలిపిన వివరాల ప్రకారం, ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన భూముల ఆక్రమణలు, అక్రమ ఇసుక రవాణా, భూ దందాలకు సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకొస్తూ వరుస కథనాలు ప్రచురిస్తున్న నేపథ్యంలో కొందరు తన కదలికలపై నిఘా పెట్టారని, తనపై రెక్కీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఆయన అన్నారు.
నిజాలు రాసినందుకే లక్ష్యమా..?
అక్రమ ఇసుక రవాణా, భూ ఆక్రమణలపై కథనాలు ప్రచురించడాన్ని జీర్ణించుకోలేక కొందరు తనను లక్ష్యంగా చేసుకున్నారని బాధిత విలేకరి ఆరోపించారు. మధ్యవర్తుల ద్వారా ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు జరిగినప్పటికీ నిజాలను వెలుగులోకి తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. తన రాకపోకలు, విధుల నిర్వహణ సమయాలపై ఆరా తీస్తున్నారని, దీనిపై పోలీసులు స్పందించి విచారణ చేపట్టాలని కోరారు.
స్థానికంగా తీవ్ర చర్చ
విలేకరిపై రెక్కీ ఆరోపణలు వెలుగులోకి రావడంతో లక్ష్మీదేవిపల్లి మండలంలో విస్తృత చర్చ జరుగుతోంది. గతంలో ప్రజా సమస్యలను ప్రశ్నించిన వ్యక్తులపై దాడులు జరిగాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. అక్రమాలపై ప్రశ్నించే వారిపై ఒత్తిడి, బెదిరింపులు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో ఈ ఆరోపణలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
భద్రత కల్పించాలని డిమాండ్
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తున్న పాత్రికేయుల భద్రతపై ప్రభుత్వం, పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా జర్నలిస్టు సంఘాలు కోరుతున్నాయి. బాధిత విలేకరి చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలు వెలికితీయాలని, అవసరమైన భద్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు.




