
సమస్య చెప్పండి.. పరిష్కారం పొందండి..
ఇక మండలంలోనే ‘ప్రజావాణి’
ప్రతి సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజల అర్జీల స్వీకరణ
సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కొత్త విధానం అమలు
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 05 2026: ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల వద్దకే పరిపాలనను తీసుకెళ్లే లక్ష్యంతో ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరిస్తూ ప్రభుత్వం G.O.Ms.No.4 (తేదీ: 04-08-2026) ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వుల ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు, సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కల్పించారు.
ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరించనుండగా, తహసీల్దార్, మండల విద్యాధికారి, మండల వ్యవసాయ అధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, పోలీసు శాఖ ప్రతినిధులు, ఎంపీఓతో పాటు అన్ని మండల స్థాయి శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల అర్జీలను స్వీకరించి, తక్షణ చర్యలు చేపట్టనున్నారు.
ప్రతి అర్జీని ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి, ఫిర్యాదుదారునికి గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదును అందజేస్తారు. దీంతో ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.
వికలాంగులు, వయోవృద్ధులు, గర్భిణులు, బాలింతలకు అర్జీల స్వీకరణలో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఎంపీడీఓ కార్యాలయాల్లో మంచినీరు, కూర్చునేందుకు సీట్లు, హెల్ప్‌డెస్క్ వంటి ప్రాథమిక సౌకర్యాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయనున్నారు.
మండల స్థాయిలోనే ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతో పాటు ఫిర్యాదుల పరిష్కారం వేగవంతం కానుందని అధికారులు పేర్కొంటున్నారు.




