
భద్రాచలం ఎమ్మెల్యేకు తప్పిన ప్రమాదం…
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు తృటిలో ప్రమాదం తప్పింది. భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఎమ్మెల్యే కారు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వద్ద గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది.
ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలం నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా పంతంగి టోల్‌ప్లాజా ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. అక్కడున్న ఒక డీసీఎం (DCM) వాహనాన్ని దాటే క్రమంలో, కారు పక్క నుంచి డీసీఎంను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు సైడ్ మిర్రర్, డోర్ తీవ్రంగా దెబ్బతిన్నాయి.ప్రమాదం తీవ్రత తక్కువగా ఉండటంతో కారులో ప్రయాణిస్తున్న ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఆయన ఇద్దరు గన్‌మెన్లు, డ్రైవర్ ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు.
దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.




